Team New Zealand: మాయ చేసిన కివీస్.. ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయం!

  • జోరు మీద ఉన్న ఇంగ్లండ్ ను మట్టికరిపించిన న్యూజిలాండ్ 
  • ఫాలో ఆన్ ఆడి గెలిచిన మూడో జట్టుగా రికార్డు
  • 1-1తో సిరీస్ సమం
new zealand creates history win the second test by one run

వన్డే, టీ20, హండ్రెడ్, టీ10.. ఇలా క్రికెట్ లో రోజుకో కొత్తరకం గేమ్ వస్తున్నా.. ఐదు రోజులపాటు సాగే టెస్టులకు మాత్రం వన్నె తగ్గడం లేదు. అసలైన క్రికెట్ అంటే టెస్టులనే చెబుతారు దిగ్గజ క్రికెటర్లు. అందులో ఉన్న మజానే వేరని చెబుతారు. తాజాగా ముగిసిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు.. ఆ మజా, థ్రిల్ ఏంటనేది చూపించింది.

ఉత్కంఠగా సాగిన టెస్టు మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే కుప్పకూలి.. రెండో ఇన్నింగ్స్ లో దీటుగా బదులిచ్చి.. ఇంగ్లండ్ ను కట్టడి చేసింది. ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో 435 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. కివీస్ 209 రన్స్ కే చతికిలపడింది. దీంతో న్యూజిలాండ్ ను ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చిన కివీస్.. కేన్ విలియమ్సన్ (132) సెంచరీకి తోడు టామ్ బ్లండెల్ (90), టామ్ లాథమ్ (83), కాన్వే (61), మిచెల్ (51) రాణించడంతో 483 పరుగులు చేసింది. ఫలితంగా 258 పరుగుల టార్గెట్ విధించింది. 

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 48-1తో పటిష్ఠంగానే ఉంది. ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ విజయానికి 210 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో తొమ్మిది వికెట్స్ ఉన్నాయి. ఇంగ్లండ్ గెలిచేస్తుందనే అందరూ అనుకున్నారు. ఎందుకంటే టీ20ల రీతిలో ఆ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. ఇటీవల అలానే గెలిచింది కూడా.

కానీ కివీస్ బౌలర్లు పట్టుబిగించారు. దీంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. 80 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయింది జట్టు. కెప్టెన్ బెన్ స్ట్రోక్స్, మాజీ కెప్టెన్ రూట్ కలిసి 121 పరుగులు జోడించారు. అయితే వాగ్నెర్.. బెన్ స్ట్రోక్స్ ని ఔట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 57 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్ లో జో రూట్ 95 పరుగులతో ఉన్నాడు. కానీ అతడు కూడా వాగ్నెర్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. 

స్టువర్డ్ బ్రాడ్, బెన్ ఫోక్స్ అలా వచ్చి ఇలా ఔట్ అయ్యారు. చివరికి ఏడు పరుగులు కొట్టాల్సి ఉంది. చేతిలో ఒక వికెట్ ఉంది. క్రీజ్ లో లీచ్, అండర్సన్ ఉన్నారు. అండర్సన్ ఒక ఫోర్ కొట్టాడు. మూడు పరుగులు చెయ్యాలి. వాగ్నెర్ ఒక వైడ్ వేశాడు. రెండు పరుగులు చేస్తే ఇంగ్లండ్ గెలుస్తుంది. కానీ వాగ్నెర్ అప్పుడే మాయచేశాడు. లెగ్ సైడ్ బంతి వేయగా.. ఆండర్సన్ బ్యాట్ అంచుని తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అంతే.. న్యూజిలాండ్ సంబరాల్లో మునిగిపోయింది. ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టీవీల్లో, మైదానంలో మ్యాచ్ చూస్తున్న వారికి థ్రిల్లర్ సినిమా చూపించింది.

ఫాలో ఆన్ ఆడిన జట్టు గెలవడం గతంలో మూడు సార్లు మాత్రమే జరిగింది. 1894, 1981లో రెండు సార్లు ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలిచింది. 2001లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు జరిగిన మ్యాచ్ నాలుగోది.

More Telugu News