mask rule: మాస్క్ రూల్ ను రెండున్నరేళ్ల తర్వాత ఎత్తేసిన హాంకాంగ్

  • రేపటి నుంచి వీధుల్లో మాస్క్ లేకుండానే తిరగొచ్చన్న హాంకాంగ్ ప్రభుత్వం
  • కరోనా కారణంగా 2020 జులై 29న మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
  • 945 రోజుల పాటు అమలుచేసిన ప్రభుత్వం.. ఉల్లంఘించిన వారికి రూ.1 లక్ష జరిమానా
After 945 Days Hong Kong Ends Worlds Longest Mask Mandate

కరోనా కేసులు గుర్తించిన కొత్తలో తీసుకొచ్చిన రూల్ ను హాంకాంగ్ ప్రభుత్వం ఈ రోజు దాకా అమలు చేస్తూనే ఉంది.. వైరస్ ప్రభావం తగ్గినా, కేసులు పెద్దగా నమోదు కాకున్నా ఆ రూల్ ను మాత్రం ఎత్తేయలేదు. అలాంటిది టూరిస్టుల రాకపై ప్రభావం చూపుతోందనే ఉద్దేశంతో తాజాగా ఆ రూల్ కు స్వస్తి చెప్పింది. ఇంతకీ ఆ రూల్ ఏమిటంటే.. కరోనా మాస్క్ కంపల్సరీ రూల్. దేశంలో వైరస్ కేసులు గుర్తించిన కొత్తలో.. 2020 జులై 29న హాంకాంగ్ ప్రభుత్వం మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇంటా బయటా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని, మాస్క్ లేకుండా కనిపిస్తే ఫైన్ విధించడంతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. రూల్ ఉల్లంఘించిన వారిని పోలీసులు పట్టుకుని జరిమానా కింద 10,000 హాంకాంగ్ డాలర్ల (రూ.1.05 లక్షలు) ను వసూలు చేశారు. దేశవ్యాప్తంగా రోజూ దాదాపు 5 వేల మందికి ఫైన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. 

2020 లో అమలులోకి వచ్చిన ఈ రూల్ ఈ రోజు (2023 ఫిబ్రవరి 28) దాకా.. అంటే మొత్తం 945 రోజులపాటు ప్రభుత్వం అమలు చేసింది. ప్రపంచంలోనే ఎక్కువ రోజుల పాటు మాస్క్ మాండేటరీ రూల్ ను అమలు చేసిన దేశంగా నిలిచింది. కాగా, రేపటి నుంచి ఈ రూల్ ను ఎత్తేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వైరస్ తీవ్రత దాదాపు పూర్తిగా తగ్గిపోవడంతో పాటు టూరిస్టులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం నుంచి మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. దీంతో హాంకాంగ్ పౌరులతో పాటు ఆ దేశానికి వెళ్లే టూరిస్టులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

More Telugu News