Delhi Liquor Scam: మద్యం పాలసీపై చివరిగా ఆమోద ముద్ర వేసింది లెఫ్టినెంట్ గవర్నరే... ఆయననెందుకు విచారించరు?: ఆప్

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియా అరెస్ట్
  • సోదాల్లో సీబీఐ సాధించింది ఏమీ లేదన్న ఆప్ నేత గోపాల్ రాయ్
  • ఇదొక రాజకీయ కుట్ర అని వ్యాఖ్యలు
  • అదానీకో న్యాయం సిసోడియాకో న్యాయమా అంటూ ఆగ్రహం
AAP fires after Manish Sisodia arrest in Delhi Liquor Scam case

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను లిక్కర్ కుంభకోణంలో సీబీఐ అరెస్ట్ చేయడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో, ఆప్ నేత గోపాల్ రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీపై చివరిగా ఆమోద ముద్ర వేసింది లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అని, మరి ఆయనను ఎందుకు ఈ కేసులో విచారించడంలేదని ప్రశ్నించారు. 

మనీశ్ సిసోడియా ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తున్నారని, మరలాంటప్పుడు ఆయనను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఎందుకు అడుగుతున్నారని సీబీఐ అధికారులను నేడు కోర్టు ప్రశ్నించిందని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. మనీశ్ సిసోడియా నివాసం, బ్యాంకు ఖాతాలు, స్వగ్రామంలో సోదాల ద్వారా సీబీఐ సాధించింది ఏమీ లేదని అన్నారు. 

మద్యం పాలసీని తారుమారు చేశారని సీబీఐ ఆరోపిస్తోందని, కానీ మద్యం పాలసీ అన్ని దశలు దాటుకుని లెఫ్టినెంట్ గవర్నర్ వరకు వెళ్లగా, ఆఖరున సంతకం చేసి స్టాంప్ వేసింది ఆయనే అని వివరించారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ను మాత్రం ఈ కేసులో ప్రశ్నించడంలేదని గోపాల్ రాయ్ విమర్శించారు. 

ఇది ఓ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా లేదని, ఇదొక రాజకీయ కుట్రను తలపిస్తోందని పేర్కొన్నారు. లిక్కర్ పాలసీలో నిజంగా దర్యాప్తు జరిగితే, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ప్రశ్నించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

అదాని గనుక మోదీ మిత్రుడు కాకపోయినట్టయితే, అదానీ వ్యవహారంపైనా ఇవాళ విచారణ జరుగుతుండేదని అన్నారు. కానీ, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కు మనీశ్ సిసోడియా మిత్రుడు కావడంతో విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించారు.

More Telugu News