Nara Lokesh: చంద్రబాబుకు, జగన్ కు ఉన్న వ్యత్యాసం అదే: లోకేశ్

  • లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు 29వ రోజు
  • చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్ర
  • చంద్రబాబు హయాంలో పరిశ్రమలు వచ్చాయని లోకేశ్ వెల్లడి
  • జగన్ పరిశ్రమలను తరిమేస్తున్నాడని ఆరోపణ
29th day of Lokesh Yuvagalam Padayatra

ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. 29వ రోజు (సోమవారం) యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో కొనసాగింది. చంద్రగిరిలో స్థానిక ప్రజలనుంచి లోకేశ్ కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతపై పూలవర్షం కురిపించి జయజయధ్వానాలు చేశారు. 

శానంబట్ల గ్రామంలో కొంతమంది డాక్టర్లు సంఘీభావం తెలిపారు. కోవిడ్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు తమకు స్పూర్తిదాయకంగా నిలిచాయని అన్నారు. 

చంద్రగిరిలో ఉత్సాహంగా పాదయాత్ర చేసిన లోకేశ్... పట్టణంలోని ఒక ఇరానీ టీ సెంట‌ర్లో టీ తాగి అక్కడి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గొంగ‌డి వేసుకుని మేక‌పిల్లని భుజాన ఎత్తుకుని చిరున‌వ్వులు చిందించారు. చిన్నారుల‌కు చాక్లెట్లు ఇచ్చి వారిని సంతోషపెట్టారు. 


జగన్ పాలనలో అన్నీ అరిష్టాలే!

జగన్ పాలనలో రాష్ట్రానికి అన్నీ అరిష్టాలేని లోకేశ్ పేర్కొన్నారు. కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ లేదని విమర్శించారు. అప్పర్ తుంగభద్రకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయిచిందని, అప్పర్ తుంగభద్ర పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

రాయలసీమకు చంద్రబాబు అనేక కంపెనీలు తీసుకొస్తే... జగన్ రెడ్డి వాటిని రాష్ట్రం నుండి తరిమేస్తున్నాడని లోకేశ్ ఆరోపించారు. "చంద్రబాబుకు, జగన్ కు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి. జగన్ రెడ్డి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు... ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది" అని విమర్శించారు. 

"అమర్ రాజా బ్యాటరీ కంపెనీని మన రాష్ట్రం నుండి జగన్ రెడ్డి తరిమేశాడు... తెలంగాణ మంత్రి కేటీఆర్ అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాడు. ఈ కంపెనీ మన రాష్ట్రం నుండి పోవడం వల్ల 20వేల మంది మన యువకులు ఉద్యోగాలు కోల్పోయారు" అని వివరించారు. 

తిరుమలను కూడా కలుషితం చేశారు!

తిరుమల కొండ పై గంజాయి దొరికింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం అవుతుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ సామాన్య భక్తులకు దేవుడ్ని దూరం చేశాడని ఆరోపించారు. "జగన్ రెడ్డి పింక్ డైమండ్ ఎక్కడుంది? తాడేపల్లి ప్యాలెస్ లాకర్లో ఉందా? ఎక్కడుంది? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు.

చంద్రగిరి ప్రజల చెవిలో చెవిరెడ్డి పూలు!

చెవిరెడ్డి చంద్రగిరి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి... ఎమ్మెల్యే, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్, ప్రభుత్వ విప్ అనే 4 పదవులు చేతిలో పెట్టుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కనీసం సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయలేదని, రోడ్లు లేవని విమర్శించారు. చెవిరెడ్డి మీ ఓట్లతో గెలిచి వెయ్యి రూపాయలు దోచుకుని...మీకు రూ.10 ఇస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

యువనేత లోకేష్ ను కలిసిన చంద్రగిరి మండల దళితులు

శానంబట్లలో లోకేశ్ ను కలిసిన చంద్రగిరి మండల దళితులు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారిపైనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ దళితుల పాలిట యముడిగా మారారని మండిపడ్డారు. 

"జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని తీరని అన్యాయం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన 12 వేల కోట్లరూపాయల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. దళితుల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తాం. ఎస్సీ, ఎస్టీలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపిన తప్పుడు కేసులను ఎత్తేస్తాం" అని హామీ ఇచ్చారు.

లోకేశ్ ను కలిసిన మీసేవ మిత్రలు

చంద్రగిరి నియోజకవర్గం తొండెవాడలో నారా లోకేష్ ను కలిసిన మీసేవ మిత్రలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. యువగళం పాదయాత్రకు వారు సంఘీభావం తెలిపారు. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఒక లంచగొండి ప్రభుత్వం అని తెలిపారు. ఆన్ లైన్ విధానం ద్వారా తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో మీసేవలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో నగదు చెల్లింపుల విధానం ద్వారా వేలకోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారని వివరించారు. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో మీసేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడంతోపాటు వేలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీసేవలను మరింత పటిష్టంచేసి పథకాల అమలు, వివిధరకాల సర్టిఫికేట్ల జారీలో జాప్యాన్ని నివారిస్తాం" అని భరోసా ఇచ్చారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 381.5 కి.మీ.

29వరోజు (సోమవారం) నడిచిన దూరం – 14.2 కి.మీ.

యువగళం పాదయాత్ర 30వ రోజు షెడ్యూల్(28-2-2023)

చంద్రగిరి నియోజకవర్గం:

ఉదయం
8.00  – మామండూరు విడిది కేంద్రంలో రజకులతో సమావేశం.
9.00 – మామండూరు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 -  నడింపల్లి గ్రామస్తులతో మాటామంతీ.
11.10 – కొంగవారిపల్లి గ్రామస్తులతో భేటీ.
మధ్యాహ్నం
1.00 – కాశిపెంట్లలో భోజన విరామం.
2.00  – కాశిపెంట్లలో మహిళలతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
3.00 -  కాశిపెంట్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
3.45 – కల్రోడిపల్లి రోడ్డు వద్ద గ్రామస్తులతో మాటామంతీ.
4.55 – పనబాకం గ్రామస్థులతో భేటీ.
7.00  – గాదంకి టోల్ గేటు వద్ద విడిది కేంద్రంలో బస.

More Telugu News