Khushbu Sundar: సినీ నటి ఖుష్బూకు కీలక పదవి!

  • జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన కుష్బూ
  • కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు 
  • మూడేళ్లు పదవిలో కొనసాగే అవకాశం
  • ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు కేంద్రం, మోదీకి ధన్యవాదాలు: కుష్బూ
film actress khushboo as ncw member orders issued

సినీ నటి, తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నియమించింది. ఆమెతోపాటు మమతా కుమారి, టెలీనా కంగ్ డోబ్ లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్లు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.  

దక్షిణాదిలో నటిగా పాపులర్ అయిన ఖుష్బూ వందకు పైగా తమిళ సినిమాల్లో నటించారు. రాజకీయాలపై ఆసక్తితో 2010లో డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2020 దాకా కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా సేవలందించారు.

తర్వాత ఖుష్బూ బీజేపీలో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు.

తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కుష్బూ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నాయకత్వంలో నారీ శక్తిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆమెకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభినందనలు తెలియజేశారు.

More Telugu News