Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ విరిగి.. రెండో బంతికి వికెట్లు ఎగిరిపడి.. బౌలింగ్ అంటే ఇదే!

Shaheen Afridi Breaks Bat Shatters Stumps On First Two Deliveries Of Innings
  • పాక్ పేసర్ షాహీన్ షా అఫ్రిది సంచలన బౌలింగ్
  • పీఎస్ ఎల్ లో పెషావర్ జాల్మీ మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టిన షాహీన్
  • గాయం తర్వాత పునరాగమనంలో అదరగొడుతున్న పాక్ పేసర్
పాకిస్థాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్భుత ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖాలండర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న షాహీన్ తన పేస్ పవర్ ఎలా ఉంటుందో మరోసారి చూపెట్టాడు. పెషావర్ జాల్మీతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో లాహోర్ జట్టు 40 పరుగుల తేడాతో బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని పెషావర్ జాల్మీని ఓడించింది. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96), అబ్దుల్లా షఫీఖ్ (41 బంతుల్లో 75), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్) రాణించడంతో లాహోర్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్ షాహీన్ దెబ్బకు బిత్తరపోయి పెషావర్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 

ఐదు వికెట్లు పడగొట్టే క్రమంలో ప్రత్యర్థి బ్యాటర్లను షాహీన్ తన పేస్ తో హడలెత్తించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్‌ను షాహీన్ అఫ్రిదీ ఆరంభంలోనే హడలెత్తించాడు. షాహీన్ సంధించిన ఇన్నింగ్స్ తొలి బంతికి.. మహ్మద్ హారీస్ బ్యాట్ విరిగి రెండు ముక్కలైంది. రెండో బంతికే హారీస్‌ను షాహీన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అతని వేగానికి వికెట్లు ఎగిరి పడ్డాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, మోకాలి గాయం కారణంగా చాలా కాలంపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న షాహీన్ ఈ లీగ్ తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తన పేస్ తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు.
Shaheen Afridi
Pakistan
psl
bowling

More Telugu News