Emcet: ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా రద్దు !

Telangana government will permanently abolish weightage of intermediate marks in Eamcet
  • తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం.. త్వరలో జీవో
  • మూడేళ్లుగా వెయిటేజీ మార్కులను రద్దు చేసిన ప్రభుత్వం
  • జేఈఈ, నీట్ పరీక్షల్లో వెయిటేజీ గతంలోనే తొలగింపు
ఎంసెట్ పరీక్షలో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చే విధానాన్ని శాశ్వతంగా తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని ఉన్నత విద్యామండలి ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా వెయిటేజీని ఎప్పటికప్పుడు రద్దు చేస్తూ వస్తోంది. తాజాగా ఈ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయించింది. 

ఇప్పటి వరకు ఎంసెట్ లో వచ్చిన మార్కులకు 75%, మిగతా 25% మార్కులకు ఇంటర్ లోని భాషేతర సబ్జెక్టులలో సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును నిర్ణియిస్తున్నారు. ఎంసెట్‌ పరీక్షలో సబ్జెక్టులైన గణితం, ఆ తర్వాత ఫిజిక్స్, చివరగా కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ర్యాంకు ప్రకటిస్తారు. కొన్నేళ్లుగా మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. పర్సంటైల్‌ కూడా సేమ్ ఉన్న సందర్భాలలో విద్యార్థి పుట్టిన తేదీ ఆధారంగా పెద్దవారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు.

కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం తొలగించింది. ఈ ఏడాదిలో కూడా ఇంటర్‌ వెయిటేజీ లేకుండానే ఎంసెట్‌ ప్రవేశాలు కల్పిస్తోంది. దీంతో ఎంసెట్‌-2023 నుంచి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులలో బట్టీ పట్టే విధానాన్ని మాన్పించడంతో పాటు సబ్జెక్ట్ పరిజ్ఞానం లేని వారిని ఫిల్టర్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలకు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు.
Emcet
Telangana
inter board
weightage
abolish

More Telugu News