Twitter: ట్విట్టర్ కార్యాలయంలోనే నిద్రించి పని చేసినా..నిర్దాక్షిణ్యంగా పీకి పడేశారు 

  • ట్విట్టర్ బ్లూ టిక్ ఇన్ చార్జ్ కు అవమానం
  • ట్విట్టర్ 2.0 కోసం రేయి, పగలూ పనిచేసినా గుర్తించని మస్క్
  • ఆమెతో పాటు 10 శాతం మందికి ఉద్వాసన
Senior Twitter exec who slept on office floor worked hardcore for Elon Musk now fired by Twitter boss

ఎలాన్ మస్క్ తాను ఎంత పని రాక్షసుడో చేతలతో నిరూపిస్తున్నారు. గతేడాది అక్టోబర్ లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను 44బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఆ వెంటనే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా ఉన్నత స్థానాల్లోని వారి నుంచి, దిగువ స్థాయి వరకు సగానికి పైగా ఉద్యోగులను తొలగించేశారు. మిగిలిన వారు పగలు, రాత్రి లేకుండా కష్టపడి ట్విట్టర్ 2.0 ఆవిష్కరణ కోసం పనిచేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. కొందరు మస్క్ వైఖరి నచ్చక రాజీనామా చేసి వెళ్లిపోయారు. మిగిలిన చాలా మంది ఉద్యోగులు చేసేదేమీ లేక మస్క్ చెప్పినట్టే నడుచుకున్నారు. 

అలా మస్క్ ఆదేశాల మేరకు ఇంటికి వెళ్లకుండా, ట్విట్టర్ కార్యాలయంలోనే నిద్రించి పనిచేసిన వారిలో ఎస్థర్ క్రాఫోర్డ్ కూడా ఒకరు. ఆమె ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ఇన్ చార్జీగానూ వ్యవహరించారు. ట్విట్టర్ కార్యాలయంలో నాడు ప్రొటెక్షన్ కవర్ కప్పుకుని నిద్రించిన ఆమె (క్రాఫోర్డ్) ఫొటోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. స్వల్ప కాలంలోనే ట్విట్టర్ 2.0ను సాకారం చేసేందుకు ఎలాన్ మస్క్ కఠిన షరతులతో ఉద్యోగులను ఇంటికి పంపించకుండా పని చేయించుకున్నారు. తీరా ట్విట్టర్ 2.0 కోసం కృషి చేసిన ఎస్థర్ క్రాఫోర్డ్ ను సైతం తాజాగా మస్క్ సాగనంపారు. మొత్తం మీద 10 శాతం ఉద్యోగులను తాజాగా మస్క్ తొలగించేశారు.

‘‘ట్విట్టర్ 2.0 సందర్భంగా నన్ను చూసిన వారు నా ఆశావాదం, కష్టపడి పనిచేయడం ఒక తప్పిదంగా అనుకుంటారు. ఎగతాళి చేసేవారు ఎప్పుడూ పక్కనే ఉంటారు. కానీ, నేను నా జట్టును చూసి చాలా గర్వ పడుతున్నాను’’ అంటూ ఎస్థర్ క్రాఫోర్డ్ ట్వీట్ చేశారు. ’‘ధన్యవాదాలు. మీ కష్టార్జితం ప్రస్తుతం ట్విట్టర్ యూజర్ ఎక్స్ పీరియన్స్ నాణ్యతను తెలియజేస్తోంది’’అంటూ ఓ యూజర్ దీనికి కామెంట్ చేశారు. క్రూరుడు.. కచ్చితంగా క్రూరుడు అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

నిజానికి క్రాఫోర్డ్ ‘స్క్వాడ్’ అనే సోషల్ మీడియా యాప్ సీఈవో. 2020లో ట్విట్టర్ స్క్వాడ్ ను కొనుగోలు చేసింది. దీంతో క్రాఫోర్డ్ ట్విట్టర్ టీమ్ లో చేరిపోయారు.

More Telugu News