Kunal Shah: ఈ సీఈఓ శాలరీ నెలకు రూ.15 వేలేనట! నెట్టింట్లో రచ్చరచ్చ

CRED CEO Kunal Shah Reveals His Salary
  • తన శాలరీ రూ. 15 వేలని చెప్పిన క్రెడ్ సీఈఓ కునాల్ షా
  • తన స్టార్టప్‌ను అమ్మగా వచ్చిన డబ్బు ఉందని వ్యాఖ్య 
  • ఈ ఉదంతంపై నెటిజన్ల మధ్య పెద్ద చర్చ
నేటి కార్పొరేట్ జమానాలో సీఈఓలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు! ఒక్క ఆలోచనతో కంపెనీల దశాదిశా మార్చేసే సీఈలకు జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈఓ కునాల్ షా తాజాగా తన శాలరీ ఎంతో బహిరంగంగా వెల్లడించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరలేపారు. దీనిపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా ఓ నెటిజన్ ఆయనపై ఓ ప్రశ్న సంధించారు. క్రెడ్‌లో తక్కువ శాలరీ తీసుకుంటూ ఎలా నెట్టుకొస్తున్నారు? అని ఓ యూజర్ ఆయనను ప్రశ్నించారు. ‘‘నా శాలరీ నెలకు రూ.15 వేలే. అయితే.. కంపెనీ లాభాలబాట పట్టేవరకూ నేను భారీ జీతభత్యాలు తీసుకోవడం సబబు కాదని అనుకుంటున్నాను. గతంలో నా కంపెనీ ఫ్రీఛార్జ్‌ను అమ్మేయగా వచ్చిన డబ్బు నాకు సరిపోతుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సంవాదం తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

నెటిజన్లు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలే వక్తం చేస్తున్నారు. కొందరేమో ఆయన నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా మరికొందరేమో అసలు కథ వేరే ఉందని చెబుతున్నారు. పన్ను చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకే శాలరీ తక్కువ తీసుకుంటున్నారని కొందరు తేల్చి చెప్పారు. ‘‘ఆయన 15 వేల జీతం గురించి చర్చించడం అమాయకత్వమే. వందల కోట్ల విలువైన తన స్టార్టప్‌ను ఆయన అమ్మేశారు. ప్రస్తుతం కునాల్ వద్ద కుప్పలు తెప్పలుగా డబ్బుంది’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Kunal Shah

More Telugu News