Five Wickets Fall In One Over: ఆరు బంతులు.. ఐదు వికెట్లు.. నాలుగు పరుగులు.. ఏం జరిగిందో మీరే చూడండి!

  • సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా జట్ల మధ్య డబ్ల్యూఎన్ సీఎల్ ఫైనల్ మ్యాచ్
  • చివరి ఓవర్ లో 5 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆస్ట్రేలియా
  • ఒక్క పరుగు తేడాతో గెలిచిన టస్మానియా
  • చివరి ఓవర్ కు సంబంధించిన వీడియో వైరల్
Five Wickets Fall In One Over In Australian Womens Domestic League Final

ఫైనల్ మ్యాచ్.. చివరి ఓవర్.. ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేయాలి.. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. బ్యాటింగ్ టీమ్ దే విజయం అనుకున్నారంతా.. కానీ అంతా తలకిందులైంది. నాలుగు పరుగులు చేయలేక బ్యాటింగ్ టీమ్ చతికిలపడితే.. ఒకే ఓవర్ లో ఐదు వికెట్లు తీసి తిరుగులేని విజయాన్నిసాధించింది బౌలింగ్ టీమ్.

ఆస్ట్రేలియాలో ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ (డబ్ల్యూఎన్ సీఎల్)లో సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 50 ఓవర్ల డే అండ్ నైట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా 50 ఓవర్లకు 264 పరుగులు చేసింది.

చేజింగ్ కు వచ్చిన సౌత్ ఆస్ట్రేలియా 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఈ సమయంలో వాన రావడంతో ఆట నిలిచిపోయింది. దీంతో డీఎల్ఎస్ రూల్ ప్రకారం.. 47 ఓవర్లలో 243 పరుగులు కొట్టాలని నిర్ణయించారు. 46 ఓవర్లకు 239 పరుగులు చేసింది సౌత్ ఆస్ట్రేలియా. చివరి ఓవర్ లో నాలుగు పరుగులు కావాలి.

అప్పుడే వచ్చింది ఫాస్ట్ బౌలర్ సారా కొయ్ టే. అద్భుతమే చేసింది. 20 బంతుల్లో 28 పరుగులు చేసి జోరు మీద ఉన్న అన్నీ ఓ నీల్ ను తొలి బంతికే బౌల్డ్ చేసింది. రెండో బంతికి ఒక పరుగు వచ్చింది.

నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేయాలి. మూడో బంతి వేయగా.. జెమ్మా బార్సీ ( 17 బంతుల్లో 28) స్టంప్ అవుట్ అయింది. నాలుగో బంతికి అమాండా జేడ్ వెల్లింగ్టన్ రనౌట్ అయింది. ఐదో బంతికి ఎల్లా విల్సన్ ఎల్ బీడబ్ల్యూ అయింది. చివరి బంతికి మూడు పరుగులు తీయాలి. కానీ ఒకే పరుగు తీసింది. రెండో పరుగు కోసం ప్రయత్నించి ముషంగ్వే రనౌట్ అయింది. అంతే ఒక పరుగు తేడాతో టస్మానియా గెలిచింది. ఓటమి అంచుల దాకా వెళ్లి.. అద్భుత విజయం సాధించి వేడుకల్లో మునిగిపోయింది.

వరుసగా రెండో సారి డబ్ల్యూఎన్ సీఎల్ టైటిల్ గెలిచిన రెండో జట్టుగా టస్మానియా నిలవగా.. వరుసగా రెండో సారి రన్నరప్ గా నిలిచి సౌత్ ఆస్ట్రేలియా నిరాశకు గురైంది. చివరి ఓవరకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి మరి!

More Telugu News