Tdp: తెలంగాణలో జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ టీడీపీ.. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో చంద్రబాబు

Tdp national chief chandrababu speech at intintiki telugudesham programm
  • ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడిన చంద్రబాబు
  • తెలుగువారి గుండెల్లో ఎప్పటకీ నిలిచి ఉండే పార్టీ తమదేనని వివరణ
  • సంక్షేమ పథకాలను పరిచయం చేసింది తమ పార్టీయేనని వెల్లడి
  • ఆహార భద్రతను ఆనాడే అమలు చేసిన నాయకుడు అంటూ ఎన్టీఆర్ పై పొగడ్తలు
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణలో పెట్టిన పార్టీ.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ ఎక్కడుందనే వారు ఇప్పుడు ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుందని చెప్పారు. పార్టీ కార్యక్రమం కోసం వచ్చిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు.

తెలంగాణలో జీవిత ప్రమాణాలు పెంచిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వివరించారు. సిటీలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారని తెలిపారు. సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన పార్టీ తమదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆహార భద్రత పథకానికి నాంది పలికిందే ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. నలభై ఏళ్ల కిందటే ఆహార భద్రతను అమలుచేసి చూపారని చెప్పారు. తెలంగాణలో రాగులు, సజ్జలు, జొన్నలు తింటూ బతుకుతున్న వారికి బియ్యాన్ని ఆయన పరిచయం చేశారని చెప్పారు. రూ.2 కిలో బియ్యంతో ఎంతోమంది పేదల కడుపు నింపారని వివరించారు.

గ్రామాలలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి నిజమైన స్వాతంత్ర్యాన్ని తెలంగాణలోని మారుమూల పల్లెలకు ఎన్టీఆర్ పరిచయం చేశారని చంద్రబాబు తెలిపారు. మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టి, భూమి శిస్తు రద్దు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని వివరించారు. మహిళా సాధికారతపై ఇప్పుడు అన్ని పార్టీలు, నేతలు మాట్లాడుతున్నారు కానీ నలభై ఏళ్ల క్రితమే మహిళల కోసం ఎన్టీఆర్ ఆలోచించారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను మహిళల పేర్లతో తీసుకురావడంతో పాటు మహిళల పేరుతో ఆస్తుల కల్పన కోసం పాటుపడ్డారని చంద్రబాబు ప్రశంసించారు.
Tdp
Telangana
Chandrababu
intintiki telugudesham

More Telugu News