Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఒక్కటే.. రాహుల్ ఆరోపణలు!

  • అదానీ గురించి పార్లమెంటులో ప్రశ్నలు అడగనివ్వలేదన్న రాహుల్ గాంధీ
  • నిజం బయటకు వచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటామని స్పష్టీకరణ
  • భారత్ జోడో యాత్రలో ఎంతో నేర్చుకున్నానని వెల్లడి 
  • యాత్రలో లక్షలాది మంది మంచు, వాన, ఎండని లెక్కచేయకుండా తన వెంట నడిచారని వ్యాఖ్య
Gautam Adani and Prime Minister Narendra Modi are onealleged rahul gandhi

ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటులో చర్చ జరగకుండా అదానీకి రక్షణగా బీజేపీ నేతలు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీలో రాహుల్ మాట్లాడారు.

‘‘గౌతమ్ అదానీని పార్లమెంటులో నేను విమర్శించాను. ప్రధాని మోదీతో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించాను. కానీ ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ఆ వ్యాపారవేత్తకు రక్షణగా వచ్చారు’’ అని ఆరోపించారు. ‘‘అదానీ గురించి పార్లమెంటులో ఎవర్నీ ప్రశ్నలు అడగనివ్వలేదు. కానీ నిజం బయటకు వచ్చే వరకు మేం ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం’’ అని స్పష్టం చేశారు.

భారత్ జోడో యాత్రలో లక్షలాది మంది తన వెంట నడిచారని, మంచు, వాన, వేడిని లెక్కచేయలేదని అన్నారు. యాత్ర ద్వారా కశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపామని, కానీ దాన్ని బీజేపీ దూరం చేసిందని ఆరోపించారు. ‘‘జోడో యాత్రలో ఎంతో నేర్చుకున్నా. నా దేశం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నడిచాను. వేలాది మంది నాతో, పార్టీతో కనెక్ట్ అయ్యారు. రైతుల సమస్యలను నేను విన్నాను. వారి బాధలను తెలుసుకున్నాను. మహిళలు, యువతను చూశాను’’ అని చెప్పారు. 

‘చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే పెద్దది, వారితో ఎలా పోరాడగలం’ అని విదేశాంగ మంత్రి అనడం జాతీయవాదం కాదని, పిరికితనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్లీనరీ శుక్రవారం మొదలైంది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు.. ఈ రోజుతో ముగియనున్నాయి.

More Telugu News