telangana: కొత్త సచివాలయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ కు వైద్యుల సంఘం లేఖ

Allocate newly built secretariat to Osmania hospital Doctors group to KCR
  • శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా పాత భవంతిని సెక్రటేరియట్ గా వాడుకోవాలని వినతి
  • ఉస్మానియాలో  కొత్త భవనం కట్టాలని చాన్నాళ్లుగా కోరుతున్న వైద్యులు
  • పాత భవంతి కూల్చివేతపై హైకోర్టులో నడుస్తున్న కేసు
తెలంగాణ ప్రభుత్వం భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి కేటాయించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్యులు లేఖ రాశారు. ఉస్మానియా ఆసుపత్రి పాత భవంతిని సచివాలయంగా వాడుకోవాలని లేఖలో కోరారు.  ఉస్మానియా పాత భవంతి ఆసుపత్రికి పనికిరాదని, కార్యాలయాల కోసం వాడుకోవచ్చని ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇవ్వడంతో హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఈ లేఖ రాసింది. ఉస్మానియా పాత భవంతిని కూల్చేసి కొత్తది కట్టాలని వైద్యులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. 

‘రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవన సమస్యను నిర్లక్ష్యం చేస్తోంది. పాత భవనంపై తుది నిర్ణయం తీసుకోలేక, కొత్త భవనాన్ని నిర్మించడం లేదు. ఫలితంగా రోగులు తాత్కాలిక షెడ్ల కింద చికిత్స పొందుతున్నారు. అన్ని విభాగాలు ఒకే భవంతిలోకి మార్చడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనివల్ల ఉస్మానియా రోగులు, సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. తెలంగాణ రోగుల ప్రయోజనం కోసం ఉస్మానియా పాత భవనాన్ని పరిపాలనా ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ భవనాన్ని సెక్రటేరియట్‌కు తాత్కాలికంగా కేటాయించవచ్చు’ అని హెచ్ఆర్డీఏ లేఖలో పేర్కొంది. కాగా, ఉస్మానియా పాత భవంతిని కూల్చి, కొత్తది కట్టడంపై హైకోర్టులో కేసు నడుస్తోంది.
telangana
secretariat
KCR
doctors
osmania hospital

More Telugu News