Amit Shah: ఆర్జేడీతో చేతులు కలిపిన నితీశ్ కు శాశ్వతంగా తలుపులు మూసేశాం: అమిత్ షా

  • పీఎం కావాలనే కోరికతో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారన్న అమిత్ షా
  • తేజస్విని తదుపరి సీఎం చేసేందుకు అంగీకరించారని విమర్శ
  • వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులను చంపేస్తున్నారని మండిపాటు
Doors closed for Nitish Kumar says Amit Shah

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కావాలనే కోరికతో బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకున్నారని... ఆర్జేడీతో చేతులు కలిపారని ఆయన మండిపడ్డారు. ఆ రెండు పార్టీలది ఒక అపవిత్రమైన కూటమి అని అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను తదుపరి సీఎం చేసేందుకు నితీశ్ అంగీకరించారని చెప్పారు. ఎప్పటికప్పడు మారిపోయే మనస్తత్వం నితీశ్ దని... ఆయనతో పూర్తిగా విసిగిపోయామని అన్నారు. 

నితీశ్ కు తమతో ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పారు. తమతో ఆయన మళ్లీ కలవాలనుకున్నా అది జరిగే పని కాదని అన్నారు. బీహార్ రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగోలేదని... రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా లేవని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులను కూడా చంపేస్తున్నారని అన్నారు. బీహార్ పరిస్థితి బాగు పడాలంటే మూడింట రెండొంతుల మెజార్టీని బీజేపీకి ఇవ్వాలని చెప్పారు.

More Telugu News