Processed Food: శుద్ధి చేసిన ఆహారాలతో క్యాన్సర్ ముప్పు!

  • బిజీ యుగంలో పెరిగిన ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం
  • తాజా అధ్యయనం చేపట్టిన లండన్ ఇంపీరియల్ కాలేజి
  • ప్రాసెస్డ్ ఫుడ్ లో రసాయనాలు ప్రమాదకరమన్న పరిశోధకులు
  • ఆకుకూరలు, కాయగూరలు, గింజ ధాన్యాలు, పండ్లు వాడాలని సూచన
Cancer risk with processed food

ఈ ఉరుకుల పరుగుల యుగంలో శుద్ధి చేసిన ఆహార పదార్థాల వినియోగం బాగా పెరిగింది. అయితే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా ప్రాణాంతక క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అని గతంలోనే తెలిసినా, వీటితో వివిధ రకాల క్యాన్సర్ల ముప్పు కూడా ఉందని తాజా అధ్యయనంతో వెల్లడైంది. 

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో, చాలామంది శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం కారణంగానే క్యాన్సర్ కు గురైనట్టు లండన్ లోని ఇంపీరియల్ కాలేజి పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 2 లక్షల మంది క్యాన్సర్ బాధితులను పరిశీలించారు. వారు తీసుకున్న ప్రాసెస్డ్ ఫుడ్ కి, క్యాన్సర్ కు దగ్గరి సంబంధం ఉన్నట్టు తెలుసుకున్నారు. 

ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ను నిల్వ చేసేందుకు వాడే రసాయనాలు, ఫుడ్ కలర్లు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు అన్నీ కలిసి క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని ఇంపీరియల్ కాలేజి పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు, శుద్ధిచేసిన ఆహారాల ప్యాకింగ్ లో ఉపయోగించే మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు, రసాయనాలు కూడా క్యాన్సర్ కు కారణమవుతున్నాయని వివరించారు. 

ముఖ్యంగా, కృత్రిమంగా తీపిదనాన్ని అందించే పదార్థాల వల్ల రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ల బారినపడుతున్నారట. ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల అండాశయ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల బారినపడుతున్నట్టు వెల్లడైంది. 

ఈ నేపథ్యంలో, శుద్ధి చేసిన ఆహారాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు అంత అధికంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే, ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలని, నిత్యం ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గింజ ధాన్యాలను ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News