MS Dhoni: తానెప్పుడూ ధోనీకి రైట్ హ్యాండ్ అంటున్న విరాట్ కోహ్లీ

I was always MS Dhonis right hand man Virat Kohli on taking captaincy from former skipper
  • తనను భవిష్యత్ సారథిగా తీర్చిదిద్దాడన్న విరాట్ కోహ్లీ
  • తన పట్ల ఎంఎస్ కు ఎప్పుడూ నమ్మకమేనని వెల్లడి
  • అతనంటే తనకూ ఎంతో గౌరవమన్న టీమిండియా స్టార్ క్రికెటర్
ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన ప్రకటన చేశాడు. ఎంఎస్ ధోనీకి తానెప్పుడూ రైట్ హ్యాండ్ మ్యాన్ (కుడి భుజం వంటి వాడినని) అని కోహ్లీ ప్రకటించాడు. తనకు కెప్టెన్సీని ధోనీ ఎలా బదలాయించాడో వివరించాడు. ధోనీతో 2008 నుంచి 2019 వరకు డ్రెస్సింగ్ రూమ్ ను కోహ్లీ పంచుకున్నాడు. కోహ్లీ నాయకత్వ లక్షణాలను పసిగట్టిన ధోనీ, ముందు నుంచే అతడికి తగిన మెలకువలు నేర్పి తదుపరి కెప్టెన్ గా అతడిని ప్రతిపాదించడం గమనార్హం.

ఆర్సిబీ పాడ్ కాస్ట్ సీజన్ 2లో భాగంగా కోహ్లీ ఈ విషయాలను వెల్లడించాడు. 2012లోనే ధోనీ తన చేయి కిందకు తనను తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. ‘‘మైదానంలో నేను ధోనీకి కుడి భుజం వంటివాడిని. ఆటలో ఏం చేయాలో ఇద్దరం కలసి చర్చించుకునే వాళ్లం. నాకు, ఎంఎస్ కు మధ్య ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నేను అతడికి వైస్ కెప్టెన్ గా ఉన్నాను. మైదానంలో ఏం చేయాలనే విషయమై తరచూ అతడితో మాట్లాడేవాడిని’’అని కోహ్లీ వివరించాడు. 

తాను కేవలం చూస్తూ ఉండకుండా ఫీల్డ్ కు సంబంధించి ఎంతో సమాచారం ఇచ్చేవాడినని కోహ్లీ తెలిపాడు. పిచ్ ఏలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేయడానికి ఏం చేయవచ్చు, తదితర విషయాలు ధోనీతో చర్చించేవాడినని కోహ్లీ వెల్లడించాడు. ‘‘ఎంఎస్ పట్ల ఎప్పుడూ దురుద్దేశాలు ఉండేవి కావు. అతను అంటే ఎల్లప్పుడూ ఎంతో గౌరవం ఉండేది. భారత క్రికెట్ కు ఎలా సారథి అయ్యాడు. అంత సుదీర్ఘకాలం పాటు ఎలా రాణించలిగాడో నాకు తెలుసు. నా పట్ల అతడికి ఎంతో నమ్మకం ఉంది. నేను అతని వద్దకు వెళ్లి దేని గురించి అయినా మాట్లాడేవాడిని’’అని కోహ్లీ వివరించాడు.
MS Dhoni
right hand man
Virat Kohli
spoken
captain

More Telugu News