ranitidine: ర్యాంటిడిన్ వాడకానికి, కేన్సర్ కు సంబంధం లేదు: కొరియా అధ్యయనం

No link between use of high selling antacid ranitidine and cancer risk Korean study
  • ఆరేళ్ల పాటు రోజువారీ ర్యాంటిడిన్ ఔషధం వినియోగం
  • కేన్సర్ రిస్క్ పెరగలేదని అధ్యయనంలో వెల్లడి
  • ర్యాంటిడిన్ లో కేన్సర్ కారక ఎన్టీఎంఏ ఉన్నట్టు 2019లో గుర్తింపు
ర్యాంటిడిన్. ఇదొక ప్రాచుర్యం పొందిన యాంటాసిడ్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినియోగమయ్యే ఔషధం. దీన్ని దీర్ఘకాలంలో వినియోగించడం వల్ల కేన్సర్ వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని కొరియా శాస్త్రవేత్తలు తాజా పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. వీరి పరిశోధన వివరాలు నేచుర్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. తాజా అధ్యయనం 25,000 మంది రోగులపై జరిగింది. 

వీరిని రెండు గ్రూపులుగా వేరు చేశారు. ఒక గ్రూప్ లోని వారికి ర్యాంటిడిన్ ఔషధాన్ని ఆరేళ్ల పాటు ఇచ్చారు. రెండో గ్రూప్ లోని వారికి ఎలాంటి ఔషధం లేని ఉత్తుత్తి ట్యాబ్లెట్ ను ఆరేళ్ల పాటు ఇచ్చారు. ర్యాంటిడిన్ వినియోగించిన మొదటి గ్రూప్ లోని వారికి కేన్సర్ రిస్క్ పెరిగినట్టు కనిపించలేదు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ కేన్సర్ రిస్క్ పెరగడం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. 

పెప్టిక్ అల్సర్, జీఈఆర్డీ(జెర్డ్), గుండెలో మంట, అజీర్ణానికి ర్యాంటిడిన్ ఔషధం మంచి ప్రభావవంతమైనది. 45 ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఔషధం ఇది. అయితే, 2019లో ఓ ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఔషధ మాత్రల్లో ఆమోదనీయం కాని స్థాయిలో ఎన్-నైట్రో సోడిమెథిలమైన్ అనే కేన్సర్ కారక కాంపౌండ్ ఉంటున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఔషధం తయారు చేసిన తర్వాత ఫార్మసీ స్టోర్లలో నిల్వ ఉండే కాలంలో ఎన్ నైట్రో సోడిమెథిలమైన్ పరిమాణం పెరుగుతున్నట్టు అధ్యయనంలో వెలుగు చూసింది. ఈ అధ్యయనం ఆధారంగా చాలా దేశాల్లో ర్యాంటిడిన్ ను నిషేధించారు. 

కానీ, మన దేశంలో ర్యాంటాక్ సహా చాలా బ్రాండ్లు, అన్ బ్రాండెడ్ ఔషధంగా ఇప్పటికీ ర్యాంటిడిన్ విక్రయమవుతోంది. ఈ తరుణంలో తాజా కొరియా పరిశోధన ఫలితాలు రోగులకు కాస్త ఉపశమనం కల్పించేవే అనడంలో సందేహం లేదు. ఎన్-నైట్రో సోడిమెథిలమైన్ (ఎన్డీఎంఏ) అనేది నైట్రోసమైన్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్లకు చెందినది. ఆల్కైలామైన్స్ తయారీ సందర్భంగా విడుదలయ్యే ఉప ఉత్పత్తి. ఇది గాలి, నీరు, నేలలోకి చేరుతుంది. పొగతాగడం, ఆహారోత్పత్తులు, ఇంట్లోని వస్తువుల ద్వారా ఇది మనల్నిచేరుతుంది. ఆల్కైలామైన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇది శరీరంలోకి చేరుతుంది. 

ranitidine
usage
cancer risk
Korean study

More Telugu News