T20 World Cup: అభిమానులకు భారత కెప్టెన్ హర్మన్ భావోద్వేగ సందేశం

India captain Harmanpreet Kaur pens emotional message to fans after T20 World Cup exit
  • టీ20 ప్రపంచ కప్ సెమీస్ లోనే ఓడిన భారత్
  • ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం
  • బలంగా తిరిగొస్తామంటూ హర్మన్ ట్వీట్
మహిళల టీ20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని అందించింది. బలమైన ఆస్ట్రేలియన్ల చేతిలో ఐదు పరుగుల తేడాతో భారత జట్టు పరాజయాన్ని చవిచూసింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఒక దశలో విజయం వైపు నడించింది. హర్మన్ అర్ధ సెంచరీ కూడా చేసింది. కానీ, కీలక సమయంలో భారత కెప్టెన్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఓటమి బాధతో మైదానంలోనే కన్నీళ్ల పర్యంతమైన హర్మన్ అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది.

టోర్నీలో తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ జట్టు ఓడిపోవడం బాధగా ఉందని తెలిపింది. హృదయ విదారక ఓటమి తర్వాత భారత జట్టు బలంగా పుంజుకుంటుదని, మైదానంలో గొప్ప ప్రదర్శన కనబరుస్తుందని  వ్యాఖ్యానించింది. ‘ఈ ప్రపంచకప్‌లో మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులందరికీ  కృతజ్ఞతలు. మా ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ జట్టు ఓటమిని చూడటం ఎంత బాధగా ఉంటుందో క్రికెట్ అభిమానిగా నాకు తెలుసు. ఇప్పుడు  నేను చెప్పేది ఒక్కటే  మేం బలంగా తిరిగి వస్తాం. గొప్ప ప్రదర్శన చేస్తాం’ అని కౌర్ ట్విట్టర్‌లో పేర్కొంది.
T20 World Cup
Team India
harmanpreet kaur
semifinal
Twitter
womens team

More Telugu News