Gujarat: వివాహానికి ముందు గుండెపోటుతో వధువు మృతి.. ఆమె చెల్లెలితో పెళ్లి!

Bride died with heart attack at mandap in Gujarat Bhavnagar
  • గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఘటన
  • ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్న వరుడు
  • అంతలోనే కుప్పకూలి మరణించిన వధువు
  • మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి మరో కుమార్తెతో పెళ్లి జరిపించిన కుటుంబం
మరికొన్ని గంటలలో ఆ ఇంట వివాహం జరగాల్సి ఉంది. బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతోంది. వరుడు కూడా వధువు ఇంటికి చేరుకున్నాడు. అంతలోనే ఆ ఇంట పెను విషాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి కుప్పకూలిన వధువు గుండెపోటుతో కన్నుమూసింది. అయినా, వివాహం ఆగలేదు. కుమార్తె మృతి బాధను పంటికింద అదిమిపెట్టుకున్న ఆమె తల్లిదండ్రులు మరో కుమార్తెతో వివాహం జరిపించారు. 

గుజరాత్‌లో జరిగిందీ ఘటన. భావ్‌నగర్ జిల్లా సుభాష్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్ పెద్దకుమార్తె హేతల్‌కు.. నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో పెళ్లి నిశ్చయమైంది. గురువారం వివాహం జరగాల్సి ఉండగా వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. 

అదే సమయంలో వధువు హేతల్ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

అయితే, ఇంతటి విషాదంలోనూ వధువు తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగకూడదని నిర్ణయించుకున్న వారు హేతల్ స్థానంలో ఆమె చెల్లిలిని ఇచ్చి పెళ్లి జరిపించేందుకు ముందుకొచ్చారు. అందుకు విశాల్ కూడా అంగీకరించాడు. దీంతో హేతల్ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి వచ్చి వివాహం జరిపించారు.
Gujarat
Bhavnagar
Bride
Bride Heart Attack

More Telugu News