Jagan: ఎండా కాలంలో కరెంట్ కోతలు ఉండకూడదు: జగన్

  • ఇంధనశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్
  • బొగ్గు నిల్వల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం
  • వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాప్యం జరగకూడదని ఆదేశం
No power cuts should be there in summer orders CM Jagan

వేసవిలో విద్యుత్ కోతలు ఉండకూడదంటూ అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కరెంట్ కోతల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితే రాకూడదని చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా ఉండేలా అధికారులు అన్ని చర్యలను తీసుకోవాలని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో ఇంధనశాఖపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, ట్రాన్స్ కో జేఎండీ పృథ్వీరాజ్ తదితరులు హాజరయ్యారు. 

సమీక్షా సమావేశంలో జగన్ మాట్లాడుతూ... థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. రైతులకు వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. మార్చ్ నాటికి మరో 20 వేలకు పైగా కనెక్షన్లను మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయని చెప్పారు. మార్చ్ నెలాఖరుకు ఇవన్నీ పూర్తవుతాయని అన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలను పూర్తి చేసుకున్న వారికి వెంటనే విద్యుత్ కనెక్షన్లను ఇస్తున్నామని చెప్పారు. 

More Telugu News