investing: రూ.10 కోట్లు సంపాదించడానికి ఎంత కాలం కావాలి?

  • ప్రతి నెలా రూ.25,000 ఉంటే చాలు.. రిటైర్మెంట్ నాటికి రూ.10 కోట్లు
  • ఏడాదికోసారి 10 శాతం పెంచుకుంటూ వెళితే త్వరగా సంపద
  • కెరీర్ ఆరంభంలోనే పెట్టుబడులు మొదలు పెట్టాలి
How long will it take to build Rs 10 crore of wealth purely by investing

ధనవంతులు కావాలని, మంచి సంపద కూడబెట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఈ జగత్తుకు మూలం ధనమేనని చెప్పినట్టు.. జీవించి ఉన్నంత కాలం మనిషి ఆరాటపడేది ఆర్జన కోసమే. కానీ, జీవితంలో అందరూ ఐశ్వర్యవంతులు కాలేరు. కొద్ది మందికే అది సాధ్యపడుతుంది. కొందరు ఎంత సంపాదించినా.. హారతి కర్పూరంలా ఖర్చు చేసేస్తుంటారు. కొందరు సంపాదించింది కొంతే అయినా.. క్రమశిక్షణతో కూడబెట్టి లక్ష్మీదేవి కటాక్షానికి నోచుకుంటూ ఉంటారు. 

సంపదను సృష్టించుకోవాలంటే, అందుకు రెండు మార్గాలు. ఒకటి వీలైనంత, శక్తి మేర సంపాదించడం. సంపాదించిన దాన్ని తీసుకెళ్లి మంచి రాబడినిచ్చే చోట పెట్టుబడి పెట్టడం. సంప్రదాయ ఫిక్స్ డ్ డిపాజిట్, బాండ్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో వార్షిక రాబడి 8 శాతం మించదు. ఈక్విటీల్లో అయితే వార్షిక రాబడి 12 శాతం, అంతకంటే ఎక్కువే ఆశించొచ్చు. ఇక ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ నుంచి వార్షికంగా 10 శాతం ప్రతిఫలాన్ని అంచనా వేయవచ్చు. ఈ ప్రకారం రూ.10 కోట్ల నిధిని కూడబెట్టుకోవడానికి ఏం చేయవచ్చో చూద్దాం.

జీవిత  కాలంలో (ఆర్జన కాలం) రూ.10 కోట్ల కోసం ప్రతి నెలా రూ.25,000 తప్పకుండా కావాలి. ఈ రూ.25 వేలను 8 శాతం రాబడులను ఇచ్చే వాటిల్లో పెడితే 42 ఏళ్లలో రూ.10.4 కోట్లు సమకూరుతుంది. ఇందులో పెట్టుబడి రూ.1.2 కోటి కాగా, మిగిలినది రాబడి. ఇక ఇదే రూ.25,000ను తీసుకెళ్లి ఏటా 10 శాతం రాబడి వచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేస్తే కేవలం 36 ఏళ్లకే రూ.10.6 కోట్లు సమకూరుతుంది. ప్రతి నెలా 25 వేలను 12 శాతం రాబడి వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకోండి.. అప్పుడు 31 ఏళ్లలోనే రూ.9.97 కోట్లు సమకూరుతుంది. 

మనకు ఏటా ఆదాయం పెరుగుతూ పోతుంది. కనుక పెరిగే మేర ఏడాదికోసారి రూ.25,000 మొత్తాన్ని అధికం చేస్తూ వెళ్లాలి. అప్పుడు పైన చెప్పుకున్న దానికంటే మరి కొన్నేళ్లు ముందే రూ.10 కోట్ల సంపద సాకారమవుతుంది. అలాగే, 25 ఏళ్లకు కెరీర్ మొదలు పెట్టి.. ప్రతి నెలా రూ.25,000 చొప్పున, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళితే అప్పుడు 50 ఏళ్లకే రూ.10 కోట్ల సంపదకు అధిపతి కావచ్చు. ప్రతి ఒక్కరూ రూ.25వేలు ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయలేరుగా? అన్న ప్రశ్న రావచ్చు. అప్పుడు మీకు వీలైనంత మొత్తాన్ని కేటాయించుకోవాలి. కొద్ది మొత్తమైనా, కాంపౌండింగ్ మహిమతో 25-35 ఏళ్ల కాలంలో మంచి నిధిగా మారుతుంది.

More Telugu News