Hyderabad: శంషాబాద్ లో 15 కిలోల బంగారం పట్టివేత.. నలుగురు సూడానీ మహిళల అరెస్ట్

  • షూలలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన వైనం
  • పట్టుబడ్డ బంగారం విలువ రూ.8 కోట్ల పైనేనన్న అధికారులు
  • మొత్తం 23 మంది సూడానీ మహిళలు వచ్చారని వివరణ
Four Sudanese women nabbed with 15 kg gold in Hyderabad

సూడాన్ నుంచి పెద్దమొత్తంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు మహిళలను కస్టమ్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.8 కోట్ల పైనే ఉంటుందని తెలిపారు. ఈ బంగారాన్ని వారు తమ షూలలో రహస్యంగా దాచి తీసుకొచ్చినట్లు అధికారులు వివరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సూడాన్ నుంచి వచ్చిన విమానంలో 23 మంది మహిళల బృందం దిగింది. వారిలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రత్యేకంగా సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. వారి షూలను పరిశీలించగా.. మడమల స్థానంలో ప్రత్యేక అరలు బయటపడ్డాయని చెప్పారు. 

అందులో బంగారాన్ని దాచి తీసుకొచ్చారని వివరించారు. నలుగురి దగ్గరా కలిపి మొత్తం 15 కిలోల బంగారం బయటపడిందని పేర్కొన్నారు. మిగతా వారిని కూడా పరిశీలించినా ఏమీ దొరకలేదన్నారు. దీంతో ఆ నలుగురు మహిళలను అరెస్టు చేసి, మిగతా వారికి నోటీసులు ఇచ్చి పంపించినట్లు అధికారులు తెలిపారు.

More Telugu News