Slaughterhouse Wastage: చికెన్, మటన్ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి... చెన్నైలో వినూత్న కార్యాచరణ

  • చెన్నై నగరంలో నిత్యం భారీస్థాయిలో మాంసం వ్యర్థాలు
  • రోజుకు 41 వేల టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్న కార్పొరేషన్
  • వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి
Bio fuel and electricity from slaughterhouse wastage

మహానగరాల్లో నిత్యం లక్షలాది కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెలు ప్రజలకు ఆహారంగా మారుతుంటాయి. ఈ చికెన్, మటన్ నుంచి వచ్చే వ్యర్థాలు కూడా భారీస్థాయిలోనే ఉంటాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వినూత్న కార్యాచరణకు నడుంబిగించింది. 

కోళ్లు, మేకలు, గొర్రెలు తదితర జీవాల మాంసం నుంచి సేకరించే వ్యర్థాలతో బయో ఇంధనం, విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చెన్నై కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. మాంసపు వ్యర్థాలతో బయో డీజిల్, బయో గ్యాస్, విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుం చెన్నై నగరంలో కార్పొరేషన్ కార్మికులు నిత్యం 41 వేల టన్నుల మాంసం వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఈ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని, బయో ఇంధనం ఉత్పత్తి చేయొచ్చని భావిస్తున్నారు. 

దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సంయుక్తంగా చేపట్టాయి. జర్మనీకి చెందిన లీబ్నిజ్ యూనివర్సిటీ సహకారం అందిస్తోంది. మాంసపు వ్యర్థాలకు కూరగాయల వ్యర్థాలను కలిపి బయో గ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. 

41 వేల టన్నుల మాంసపు వ్యర్థాలతో 4 వేల యూనిట్ల విద్యుచ్ఛక్తి కానీ 600 కిలోల బయోగ్యాస్ ను కానీ ఉత్పత్తి చేయవచ్చని గుర్తించారు. 

ఇక కేరళలోని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీలో మాంసపు వ్యర్థాలతో బయో డీజిల్ ఉత్పత్తి చేయడంపై పరిశోధనలు సాగుతున్నాయి.

More Telugu News