MLC Elections: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందడి

  • ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
  • నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరి రోజు
  • రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద కోలాహలం
  • నామినేషన్లు వేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
MLC nominations takes place in AP

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. నేడు నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కాగా, అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు తరలి వెళుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ బరిలో దిగిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం (వైసీపీ) ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఉన్నారు. 

అటు ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ నామినేషన్ వేశారు. సీతంరాజు సుధాకర్ నామినేషన్ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తదితరులు తరలివచ్చారు. 

ఉత్తరాంధ్ర పట్టభద్రుల టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చిరంజీవి కూడా నామినేషన్ దాఖలు చేశారు. చిరంజీవి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఇతర టీడీపీ నేతలు హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కూడా నామినేషన్ వేయగా, ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తరలివచ్చారు. 

చిత్తూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 7 నామినేషన్లు దాఖలు కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఒక నామినేషన్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలయ్యాయి. 

అనంతపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వెన్నపూస రవీంద్రారెడ్డి (వైసీపీ), స్థానిక సంస్థల కోటాలో మంగమ్మ (వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో వైసీపీ అభ్యర్థిగా మేరుగ మురళి నామినేషన్ వేశారు. 

ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

More Telugu News