EPS: ఆయనకే అన్నాడీఎంకే పగ్గాలు.. తీర్పు చెప్పిన సుప్రీం

Setback For OPS Supreme Court Allows Rival EPS To Stay AIADMK Chief
  • అన్నాడీఎంకే వివాదంపై మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు
  • పార్టీ బాధ్యతను ఎడప్పాడి పళనిస్వామికే అప్పగించాలని తీర్పు
  • డీఎంకే బీ-టీమ్ గా పని చేస్తున్న వారి ముసుగులు తొలగిపోయాయన్న పళనిస్వామి
అన్నాడీఎంకే చీఫ్ పదవి విషయంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ పగ్గాలు తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికే అప్పగించాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ప‌ళ‌నిస్వామికి పెద్ద ఊర‌ట ల‌భించినట్లయింది. గ‌తంలో అన్నాడీఎంకే వివాదంపై మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఈ రోజు సమర్థించింది. పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

‘‘సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందోనని నాకు అనుమానం ఉండేది. తాజా తీర్పుతో డీఎంకే బీ-టీమ్ గా పని చేస్తున్న వారి ముసుగులు తొలగిపోయాయి. అన్నాడీఎంకే 100 ఏళ్లు పాలన సాగిస్తుందని నాడు అసెంబ్లీలో జయలలిత చెప్పారు. ఈ తీర్పు ద్వారా అది నిరూపితమైంది’’ అని పళనిస్వామి అన్నారు. సుప్రీం తీర్పుతో పళనిస్వామి మద్దతుదారులు చైన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

2016లో త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకేలో నాయకత్వ అంశంపై వివాదాలు చెలరేగాయి. దీంతో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని ర‌ద్దు చేశారు. పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప‌న్నీర్ సెల్వం, సంయుక్త స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప‌ళ‌నిస్వామి కొన‌సాగారు. అయితే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలతో గత ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ళ‌నిస్వామిని ఎన్నుకున్నారు.

దీన్ని వ్యతిరేకిస్తూ మ‌ద్రాస్ హైకోర్టును ప‌న్నీర్ సెల్వం ఆశ్రయించారు. అన్నాడీఎంకేకు శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మాత్రమేనని, ఆ పదవిలో కూర్చునేందుకు ఎవ్వరికీ హక్కు లేదని పన్నీర్‌సెల్వం వాదించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ప‌న్నీర్ సెల్వం‏ను అన్నాడీఎంకే నుంచి పళనిస్వామి బహిష్కరించడం సంచలనమైంది.
EPS
OPS
EPS To Stay AIADMK Chief
Supreme Court
AIADMK
Edappadi Palaniswami
Panneerselvam

More Telugu News