AAP: లిక్కర్ స్కాం కేసు.. కేజ్రీవాల్ కార్యదర్శిని విచారించిన ఈడీ

  • ఢిల్లీ సర్కారు లిక్కర్ పాలసీలో అక్రమాలు
  • ఆరోపణలతో వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు
  • ఆరోపణల నేపథ్యంలో సీబీఐ, ఈడీల విచారణ
Kejriwals Aide Questioned By ED In Liquor Policy Case

లిక్కర్ పాలసీ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సర్కారులోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి ఊతమిచ్చేలా మరో ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యదర్శిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో జరిగిన అక్రమాలపై కేజ్రీవాల్ కార్యదర్శి బిభవ్ కుమార్ ను ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. 

ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో పలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ పాలసీని ఆప్ సర్కారు వెనక్కి తీసుకుంది. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అధికారులను, వ్యాపారవేత్తలను, రాజకీయ నేతలను విచారించారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేసులో కీలక నిందితుడు సమీర్ మహేంద్రుకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్య ఫేస్ టైమ్ వీడియో కాల్ ఆరేంజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కార్యదర్శిని అధికారులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News