Rahul Gandhi: బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రాహుల్ గాంధీ

  • షిల్లాంగ్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారం
  • బీజేపీకి మేలు చేసేందుకే తృణమూల్ బరిలోకి దిగుతోందన్న రాహుల్ 
  • బీజేపీ, ఆరెస్సెస్ రెండూ దేశంలోని వ్యవస్థలపై దాడులకు దిగుతున్నాయని విమర్శలు 
Rahul Gandhi attacks BJP and TMC in poll bound Meghalaya

ఎన్నికల ప్రచారంలో భాగంగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. బీజేపీ, ఆరెస్సెస్, తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు తమకు అన్నీ తెలుసని అనుకుంటాయని, కానీ ఎవరికీ గౌరవం మాత్రం ఇవ్వవని విమర్శించారు. తమ సొంత సిద్ధాంతాలతో దేశంలోని వ్యవస్థలపై ఆ రెండు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

తమిళనాడు, కర్ణాటక, జమ్మూకశ్మీర్, హర్యానా సహా ప్రతి రాష్ట్రంలోనూ ఆరెస్సెస్ దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్, మీడియా, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడేందుకే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించినట్టు చెప్పారు. 

అలాగే, తృణమూల్ కాంగ్రెస్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేస్తోందని దుయ్యబట్టారు. హింస, కుంభకోణాల చరిత్ర కలిగిన టీఎంసీ గోవా ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి బీజేపీకి ప్రయోజనం చేకూర్చిందన్నారు. ఇప్పుడు మేఘాలయలోనూ అదే పని చేస్తోందని రాహుల్ ఆరోపించారు.

More Telugu News