YSRTP: హిజ్రా అక్కచెల్లెళ్లకు బేషరతు క్షమాపణలు: వైఎస్ షర్మిల

  • శంకర్ నాయక్‌ విమర్శలను తిప్పికొట్టే క్రమంలో హిజ్రాల ప్రస్తావన తీసుకొచ్చిన షర్మిల
  • క్షమాణలు చెప్పాలంటూ డిమాండ్
  • వారి మనసులు గాయపడి ఉంటే క్షమించాలన్న వైటీపీ అధినేత
  • తెలంగాణ రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ గవర్నర్‌ను కలుస్తామన్న షర్మిల
YS Sharmila Reacts On Hijras Controversy

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హిజ్రాలకు బేషరతు క్షమాపణలు తెలిపారు. ఇటీవల మహబూబాబాద్‌లో జరిగిన పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ను ఆమె విమర్శిస్తూ హిజ్రాల ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై హిజ్రాలు భగ్గుమన్నారు. షర్మిల క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేదంటే ఆమె పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హిజ్రాలకు బేషరతు క్షమాపణలు తెలిపారు. వారి మనసులు గాయపడి ఉంటే క్షమించాలని కోరారు.  

వరంగల్‌లో పార్టీల ఘర్షణలో గాయపడిన పవన్ కుమార్ అనే కాంగ్రెస్ కార్యకర్తను సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో షర్మిల పరామర్శించారు. అనంతరం బయట విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే తప్ప లా అండ్ ఆర్డర్ గాడిలో పడదన్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతి పాలనను కోరుతామన్నారు. 

హిజ్రాల ఆందోళనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షర్మిల బదులిస్తూ.. హిజ్రాలను కించపరచడం తన ఉద్దేశం కానే కాదన్నారు. హామీలు నిలబెట్టుకోని ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను నిలదీసిన తనను ఆయన అవమానించినట్టు మాట్లాడారని అన్నారు. ఆయన మాటలను తిప్పికొట్టే క్రమంలో హిజ్రాల ప్రస్తావన తీసుకొచ్చానని అన్నారు. సమాజంలో హిజ్రాలకు ఉన్నపాటి గౌరవం కూడా ఆయనకు లేదని మాత్రమే అన్నానని గుర్తు చేశారు. తన మాటల వల్ల హిజ్రా అక్కచెల్లెళ్ల మనసులు గాయపడి ఉంటే తనను క్షమించాలని, వారికి బేషరతు క్షమాపణలు తెలుపుకుంటున్నానని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హిజ్రాల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. 

More Telugu News