Mallikarjun Kharge: 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా మా గెలుపును అడ్డుకోలేరు: మల్లికార్జున ఖర్గే

  • 2024లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందన్న ఖర్గే 
  • దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ వాళ్లేనని వ్యాఖ్య 
  • 2014లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని బీజేపీ వాళ్లు అనుకుంటుంటారంటూ ఎద్దేవా 
Congress Led Government In 2024 says Mallikarjun Kharge

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిదే విజయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా తమ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. ఈ దేశాన్ని నడపించేది తానేనని, తనను ఎవరూ టచ్ చేయలేరని ప్రధాని మోదీ పలు మార్లు అన్నారని... ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్లు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అన్నారు. మీరు నియంత కాదని... ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించారో, అదే ప్రజలు మీకు గుణపాఠం నేర్పుతారని అన్నారు. నాగాలాండ్ లో నిర్వహించిన ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని ఖర్గే తెలిపారు. అందరితో అభిప్రాయాలను పంచుకుంటున్నామని చెప్పారు. ఈ సారి బీజేపీకి మెజార్టీ రాదని.. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ వాళ్లని, బీజేపీ వాళ్లు కాదని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఒక్క బీజేపీ నేత అయినా జైలుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన గాంధీని వాళ్లే చంపారని విమర్శించారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని చెప్పారు. 2014లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని బీజేపీ వాళ్లు అనుకుంటూ ఉంటారని.. వాళ్లకు 1947 గుర్తు ఉండదని మండిపడ్డారు.

More Telugu News