Ukraine: ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారికి ఇక్కడి మెడికల్ కాలేజీల్లో ప్రవేశం లేదు: కేంద్రం

no possible to join Indian medical colleges for ukraine left students central governament
  • మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కుదరదన్న కేంద్రం
  • చివరి సంవత్సరం విద్యార్థులకు కంబైన్డ్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష
  • బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు తెలియజేసిన కేంద్ర మంత్రి మాండవీయ
రష్యా దండయాత్ర దరిమిలా ఉక్రెయిన్ నుంచి బతుకు జీవుడా అంటూ భారత్ కు తిరిగొచ్చేసిన వైద్య విద్యార్థుల భవిష్యత్ అయోమయంగా తయారైంది. మొదట్లో ఇలా వచ్చిన వైద్య విద్యార్థులకు తగిన సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించగా.. దేశీయ కాలేజీల్లో వారికి ప్రవేశాలు కల్పించే అవకాశం లేదని కేంద్ర సర్కారు తాజాగా తేల్చి చెప్పింది. దీనిపై జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ పూర్తి వివరాలతో ఎంపీ పాటిల్ కు లేఖ ద్వారా బదులిచ్చారు.

విదేశాల్లో అడ్మిషన్లు పొంది, అక్కడ కొంత వరకు వైద్య విద్య పూర్తి చేసిన వారిని దేశీయ కళాశాలల్లో చేర్చుకోవడం కుదరదని మంత్రి మాండవీయ స్పష్టం చేశారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, నేషనల్ మెడికల్ యాక్ట్ 2019 ప్రకారం ఇందుకు వీలు పడదని తెలిపారు. 

కాకపోతే ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా వైద్య విద్య పూర్తి చేయలేకపోయిన చివరి సంవత్సరం విద్యార్థులకు కంబైన్డ్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఇక్కడ రెండేళ్లపాటు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉక్రెయిన్ లో వైద్య విద్యను అర్ధంతరంగా నిలిపివేసి వచ్చిన విద్యార్థుల ముందున్న ఏకైక ఆప్షన్.. వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన 29 దేశాల్లో ఎక్కడైనా మిగిలిన కోర్స్ పూర్తి చేసుకోవడమే.
Ukraine
medical students
admission
indian colleges
not possible
centre

More Telugu News