Marital Age: దేశంలో స్త్రీ, పురుషులకు ఒకే వివాహ వయసు ఉండాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court dismisses the petition seeking orders for same marital age to men and women
  • దేశంలో మహిళల వివాహ వయసు మార్చాలంటూ పిటిషన్
  • పురుషుల వివాహ వయసు 21
  • మహిళలకు కూడా అదే వివాహ వయసు కోరుతూ పిటిషన్
  • అది పార్లమెంటు పరిధిలోని అంశమన్న సుప్రీంకోర్టు
దేశంలో పురుషులకు, మహిళలకు కనీస వివాహ వయసు ఒకే విధంగా ఉండాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కనీస వివాహ వయసుపై ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

పురుషుల వివాహ వయసు 21 అయినప్పుడు, మహిళల వివాహ వయసును కూడా 21 సంవత్సరాలు అని ప్రకటించాలని, ఆ మేరకు చట్ట సవరణ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలా బెంచ్ విచారణ చేపట్టింది. 

స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, దీంట్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి కేవలం సుప్రీంకోర్టు ఒక్కటే రక్షణ కల్పించదని పేర్కొంది. పార్లమెంటు వంటి పలు వ్యవస్థలు కూడా రాజ్యాంగ పరిరక్షణలో పాలుపంచుకుంటున్నాయని వివరించింది. 

కనీస వివాహ వయసు చట్ట సవరణ చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, దానిపై తాము పార్లమెంటుకు ఆదేశాలు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్ట సవరణ చేస్తే మహిళలకంటూ ఓ వివాహ వయసు లేకుండా పోతుందని అభప్రాయపడింది.
Marital Age
Men
Women
Supreme Court
Parliament
India

More Telugu News