Pawan Kalyan: మిడిమిడి జ్ఞానం కలిగినవారు పాలకులైతే మాతృభాష మృతభాషగా మారిపోతుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Telugu people on Mother language day
  • నేడు మాతృభాషా దినోత్సవం
  • తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • మాతృభాషతో సంస్కృతి పదిలంగా ఉంటుందని వ్యాఖ్య 
  • క్లిష్ట సమయాల్లో ప్రజలు భాషోద్ధారకులుగా నిలవాలని పిలుపు

ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తన సందేశం అందించారు. మాతృభాషతోనే మనోవికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మనోవికాసానికి మూలధనం మాతృభాష అని, అదే అమ్మ భాష అని వివరించారు. 

బిడ్డకు ఉగ్గుపాలతోనే లోకజ్ఞానాన్ని కలిగించేది మాతృభాషేనని గుర్తించిన యునెస్కో ప్రతి ఏటా ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

"ఈ సుదినాన్ని పురస్కరించుకుని తెలుగువారందరికీ శుభాకాంక్షలు. మాతృభాష పదిలంగా ఉన్నప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలు పదిలంగా ఉంటాయి. అప్పుడే జాతి సజీవంగా, సగర్వంగా అలరారుతుంది. అయితే, మిడిమిడి జ్ఞానం కలిగినవారు పాలకులైతే మాతృభాష మృత భాషగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజలే భాషోద్ధారకులుగా మారాల్సిన అవసరం ఉంది. 

ఏపీ నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ గారికి యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ రాసిన లేఖలో... ఉన్నత విద్యలో మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహించాలని, పాఠ్యపుస్తకాలు మాతృభాషలో అందించేలా చూడాలని కోరారు. జగదీశ్ గారు పేర్కొన్న అంశాలను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలి. జయతే మాతృభాష... జయ జయహే తెలుగు భాష" అంటూ పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Loading...

More Telugu News