Bonda Uma: చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో జగన్‌కు జ్వరం: బోండా ఉమ

  • ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పట్టాభిని అరెస్టు చేశారన్న ఉమ 
  • 20 గంటలు గడుస్తున్నా పట్టాభి వివరాలు తెలియట్లేదని ఆవేదన
Bonda Umamaheswara Rao press meet over Pattabhis arrest

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, హత్యలు, దాడులు, తప్పుడు కేసులు పెరిగిపోయాయన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల ఇళ్లు, ప్రతిపక్షాల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓ ఫ్యాక్షనిస్టు సైకో పరిపాలన ఎలా ఉంటుందో జగన్ పాలనలో ప్రజలకు తెలిసిందని వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర పోలీసుల తీరుపైనా బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారని మండిపడ్డారు. ప్రమోషన్ల కోసం కొంతమంది పూర్తిగా వైసీపీ కండువాలేసుకున్నట్టు పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఈ క్రమంలోనే జగన్ ఫ్రస్ట్రేషన్‌తో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతుంటే జగన్‌కు జ్వరం వస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్ పర్యటనలకు కావాలనే ఆటంకాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి విషయంలోనూ ఆయన మండిపడ్డారు. ‘‘స్థానిక ఎమ్మెల్యే అవినీతిని వెలికి తీయడం తప్పా..? ఏ తప్పు చేశామని దాడికి దిగారు?’’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తమను భయపెట్టి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందన్న ఆయన.. ఇలాంటి బెదిరింపులకు టీడీపీ భయపడదని స్పష్టం చేశారు. ఓ ఎమ్మెల్యే అరాచకాల్ని వెలుగులోకి తెచ్చినప్పుడు ప్రభుత్వం దర్యాప్తు జరిపించి ప్రజలకు నిజం చెప్పాలన్నారు. దీనికి బదులు.. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడికి దిగడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారని చెప్పారు. టీడీపీ హయాంలో ఇటువంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. 

పట్టాభి ఆచూకీ తెలియకపోవడంపై కూడా బోండా ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తపై దాడి జరగడంతో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పట్టాభిని అరెస్టు చేశారని ఆరోపించారు. ఎందుకు అరెస్టు చేశారో ఇప్పటికీ కారణం తెలీదన్నారు. పట్టాభి ఆచూకీ తెలియక 20 గంటలు దాటిందని, ఆయనను ఏ స్టేషన్‌లో పెట్టారో ఇంకా తెలియరాలేదన్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు స్పందించట్లేదని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హితవు పలికారు.

More Telugu News