Devineni Uma: జగన్ సైకోయిజానికి ఎవ్వరూ భయపడరు: దేవినేని ఉమ

tdp leader devineni umamaheshwar rao fires on cm jagan
  • పులివెందుల అరాచకాన్ని కృష్ణా జిల్లాకు జగన్ చూపించారన్న ఉమ 
  • రాష్ట్రంలో పరిపాలన, చట్టం లేవని విమర్శ
  • పైశాచిక ఆనందంతో పట్టాభిని పోలీసులు తిప్పుతున్నారని ఆగ్రహం
సీఎం జగన్ సైకోయిజానికి ఎవ్వరూ భయపడటం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్ చూపించారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ఘటనకు పూర్తిగా జగన్ రెడ్డి , వల్లభనేని వంశీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బోడే ప్రసాద్ ను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని, కార్యకర్తలను, నాయకులను లాక్కెళ్లారని ఆరోపించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మూసేశారని దేవినేని ఉమ అన్నారు. పోలీసుల పర్యవేక్షణలో గంజాయి బ్యాచ్ గన్నవరంలో స్వైర విహారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన, చట్టం లేదని.. డీజీపీ ఆఫీస్ మూసేసుకున్నారని అన్నారు. డీఐజీ నోరు తెరవడం లేదని.. ఎస్పీ ఫోన్ ఎత్తడం లేదని విమర్శించారు. గన్నవరం ఘటనపై గుండాలను, శాసనసభ్యుడ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

పైశాచిక ఆనందంతో పట్టాభిని పోలీసులు తిప్పుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. ‘‘పట్టాభి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ప్రాణాలకు తెగించే పట్టాభి ధైర్యంగా ముందుకు వెళ్లారు. దాన్ని సహించుకోలేక ఈ దుర్మార్గులు దాడులు చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ నేతలు అంతా సంఘీభావం తెలియచేసి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఇంతకింత వైసీపీ అనుభవిస్తుందని దేవినేని అన్నారు. ప్రజల తిరుగుబాటే దీనికి సమాధానం అవుతుందన్నారు. ప్రజలను కార్యకర్తలను, నాయకులను అణగదొక్కలేరని హెచ్చరించారు.
Devineni Uma
YS Jagan
Pattabhi
YSRCP
TDP

More Telugu News