Scotland: రోజుకు 36 వేలు ఇస్తామన్నా ఒక్కరూ చేరట్లేదు.. ఈ ఉద్యోగం ఏంటంటే..!

 Job In Scotland Pays Rs 36000 Per Day But Nobody Wants It
  • ఆఫ్‌షోర్ రిగ్స్‌లో ఉద్యోగాలకు చమురు సంస్థ ప్రకటన
  • రోజుకు 36 వేల వేతనం ఇస్తామని వెల్లడి
  • ఉద్యోగంలో చేరేవారి కోసం నెలరోజులుగా వేచి చూస్తున్న సంస్థ
రోజుకు 36 వేల రూపాయల జీతం ఇస్తామంటూ ఎవరైనా ఆఫర్ ఇస్తే మీరు ఊరుకుంటారా..? వెంటనే ఉద్యోగంలో చేరిపోరూ..? అయితే.. సరిగ్గా ఇదే ఆఫర్ ఇచ్చిన ఓ సంస్థ.. ఉద్యోగులు దొరక్క సతమతమవుతోంది. అభ్యర్థుల కోసం నెలరోజులుగా ఎదురు చూస్తోంది. ఇప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉంది. స్కాట్‌లాండ్‌కు చెందిన ఓ చమురు సంస్థ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. ఆఫ్‌షోర్‌ రిగ్స్‌లో పని చేసేందుకు ఉద్యోగులు కావాలంటూ ఎమ్‌డీ కన్సల్టెంట్స్ అనే రిక్రూట్‌మెంట్ సంస్థ ద్వారా ఈ ప్రకటన వెలువరించింది. 

సముద్రం అడుగున భూమిపొరల్లోని చమురును వెలికితీసేందుకు ఉద్దేశించిన భారీ నిర్మాణాలను ఆఫ్‌షోర్ రిగ్స్ అంటారు. చమురును వెలికితీసి, నిల్వచేసేందుకు ఆఫ్‌షోర్ రిగ్స్‌లో అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. ఇక సంస్థలో చేరే వారు ఏడాదికి గరిష్ఠంగా ఆరు నెలల పాటు రిగ్స్‌లోనే పనిచేయాలి. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఉద్యోగుల ఒక్కో షిఫ్ట్ 12 గంటలపాటు ఉంటుంది. ఉద్యోగుల ప్రారంభ వేతనమే నెలకు రూ.4 లక్షలు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే). ఉద్యోగులకు ఓ హాలిడే ట్రిప్‌ ఖర్చంతా సంస్థే భరిస్తుంది. ఇందులో ఎవరైనా రెండేళ్ల పాటు పనిచేయగలిగితే ఏకంగా కోటి రూపాయలు మూటగట్టుకుని ఇంటికి పోవచ్చు. మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. అయినా సంస్థ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని సమాచారం.
Scotland

More Telugu News