Vijayasai Reddy: తారకరత్న అంత్యక్రియలకు బాలకృష్ణ ముహూర్తం పెట్టారు: విజయసాయిరెడ్డి

  • రేపు సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు
  • మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • అంతకుముందు తారకరత్న భౌతికకాయం ఫిలించాంబర్ కు తరలింపు
  • వివరాలు తెలిపిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy talks to media about Tarakaratna funerals

నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. తారకరత్న చాలా మంచి వ్యక్తి అని, సినీ రంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని తెలిపారు. తారకరత్న అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరుగుతాయని వివరించారు. తారకరత్న భార్య అలేఖ్య మానసిక ఒత్తిడికి గురైందని అన్నారు. తారకరత్న మరణాన్ని అలేఖ్య జీర్ణించుకోలేకపోతోందని విజయసాయి వెల్లడించారు.  

"తారకరత్న మరణం కుటుంబ సభ్యులను, అభిమానులను ఎంతో బాధించింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే తారకరత్న మరణించడం విచారించదగ్గ విషయం. రాజకీయాల్లో ప్రవేశించాలని తారకరత్న భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం. సినీ రంగంలో చిన్నా పెద్దా అని చూడకుండా అందరితో మంచిగా మెలిగిన అద్భుతమైన వ్యక్తి తారకరత్న. ప్రతి ఒక్కరినీ కూడా పేరు పేరునా అన్నయ్యా, అక్కయ్యా, చెల్లెమ్మా, మామయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచే మంచి వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోతారు. 

తారకరత్నకు ముగ్గురు పిల్లలు. మొదట ఓ అమ్మాయి, తర్వాత కవలలు జన్మించారు. కవలల్లో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. తారకరత్నకు గుండెపోటు వచ్చాక బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చాలా శ్రద్ధ తీసుకున్నారు. 

బాలకృష్ణ అనేక పర్యాయాలు బెంగళూరులోని ఆసుపత్రిని సందర్శించి డాక్టర్లతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా అత్యుత్తమ చికిత్స అందించేలా కృషి చేశారు. అందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

రేపు ఉదయం 9.03 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిలించాంబర్ వద్దకు తరలిస్తున్నాం. బాలకృష్ణ గారు ముహూర్తం పెట్టిన విధంగా సాయంత్రం 3 గంటల తర్వాత మహాప్రస్థానం శ్మశానవాటికలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తారు" అని విజయసాయి వెల్లడించారు. 

ఇక, అలేఖ్యా రెడ్డి అస్వస్థతకు గురికావడంపై విజయసాయిరెడ్డి వివరించారు. అలేఖ్య... తారకరత్నను ఎంతగానో ప్రేమించిందని, అలాంటి వ్యక్తిని కోల్పోవడంతో ఆమె తీవ్ర మనోవేదన అనుభవిస్తోందని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురికావడంతో కాళ్లు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపించాయని, అయితే ఆమె ఆరోగ్యంపై అధైర్యపడాల్సిన అవసరంలేదని విజయసాయిరెడ్డి అన్నారు. కొంతకాలం తర్వాత ఆమె మామూలు మనిషి అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. 

తారకరత్న ఫ్యామిలీ కూడా తమ కుటుంబంలో ఒక భాగమేనని బాలకృష్ణ భరోసా ఇచ్చారని, అన్నింటికీ తాను అండగా నిలుస్తానని మాటిచ్చారని, తారకరత్న కుటుంబం ఆయనకు రుణపడి ఉంటుందని చెప్పారు.

More Telugu News