Team India: రెండో టెస్టు కూడా రెండున్నర రోజుల్లోనే... ఆసీస్ పై భారత్ విన్

  • ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి
  • 115 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లకు ఛేదించిన భారత్
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్, పుజారా, కేఎస్ భరత్, కోహ్లీ
  • 4 టెస్టుల సిరీస్ లో 2-0తో భారత్ ఆధిక్యం
Team India once again finish Aussies in two and half days

సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులోనూ టీమిండియానే విజయం వరించింది. నాగపూర్ టెస్టు తరహాలోనే ఢిల్లీలోనూ మనవాళ్లు రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ను ముగించడం విశేషం. మరోసారి అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన భారత్ రెండో టెస్టులో ఆసీస్ ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 

ఆటకు మూడో రోజున 115 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్... 26.4 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు చేసి విజయభేరి మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 31, విరాట్ కోహ్లీ 20, శ్రేయాస్ అయ్యర్ 12 పరుగులు చేయగా.... ఛటేశ్వర్ పుజారా 31, కేఎస్ భరత్ 23 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలుపు తీరాలకు చేర్చారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ 2, టాడ్ మర్ఫీ 1 వికెట్ తీశారు. 

అసలు, ఈ మ్యాచ్ లో క్రెడిట్ అంతా టీమిండియా స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లకే దక్కుతుంది. ముఖ్యంగా, రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడుతున్న ఆసీస్ కు కళ్లెం వేయడంతో పాటు వారిని స్పిన్ ఉచ్చులో బిగించి కుప్పకూల్చిన ఘనత వీరిద్దరిదే. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో జడేజా 7 వికెట్లతో చెలరేగిపోగా, అశ్విన్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. 

అదే గనుక, ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో భారత్ కు 200 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే మ్యాచ్ ఫలితం ఊహించడం కష్టమయ్యేది. కానీ, ఆ అవసరం రాకుండా జడేజా, అశ్విన్ తమ స్పిన్ నైపుణ్యంతో భారత్ విజయానికి బాటలు వేశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటౌంది. అందుకు బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకు కుప్పకూలడం తెలిసిందే. 

ఈ విజయంతో భారత్ 4 టెస్టుల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది.

More Telugu News