actor: దక్షిణాది సినీ పరిశ్రమలో మరో విషాదం.. తమిళ హాస్యనటుడు కన్నుమూత

South Actor Mayilsamy passed away due to ill health at 57 Age
  • అనారోగ్యంతో మృతి చెందిన తమిళ నటుడు మయిల్ స్వామి
  • 200పైకి చిత్రాల్లో నటించిన మయిల్ స్వామి
  • విచారం వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలచి వేస్తున్నాయి. తెలుగు సినీ నటుడు తారకరత్న మరణవార్త నుంచి కోలుకునేలోపే దక్షిణాదిలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్.మయిల్‌ స్వామి (57) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు పోరూర్ రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఈ ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. మయిల్ స్వామి తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రముఖ హీరోలతో కలిసి తెరపంచుకున్న ఆయన తన హాస్యంతో అలరించారు. స్టాండప్ కమెడియన్‌గా, టీవీ హోస్ట్‌గా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

మయిల్‌ స్వామి 1984లో ‘ధవని కనవుగల్‌’ సినిమాతో అరంగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో సుమారు 200 సినిమాలకు పైగా నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులతోపాటు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘హాస్యనటుడు మయిల్‌ స్వామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని నేను చాలా బాధపడ్డాను. పార్టీలకు అతీతంగా ఆయన అందరితో స్నేహంగా ఉన్నారు. విరుగంపాక్కం ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవలు చేశారు. ఎన్నో చిత్రాల్లో తన హాస్యంతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు.
actor
south india
Mayilsamy
passed away
Tamilisai Soundararajan

More Telugu News