Sonu Sood: ఇప్పట్లో రాజకీయాల్లోకి రాబోనన్న నటుడు సోనూ సూద్.. జీవిత లక్ష్యాన్ని వెల్లడించిన బాలీవుడ్ నటుడు

No it will take some time to come into politics says bollywood star sonu sood
  • ‘ది పార్క్’ హోటల్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో కార్యక్రమం
  • పలు ఘటనలను గుర్తు చేసుకున్న సోనూ సూద్
  • ప్రతి గ్రామంలో వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే లక్ష్యమన్న నటుడు
‘‘నాకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. నా జీవిత లక్ష్యం వేరే. ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఏర్పాటు చేయడమే నా లక్ష్యం’’ ఈ మాటలన్నది మరెవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్. హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్క్ హోటల్‌లో నిన్న నిర్వహించిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో మాట్లాడుతూ సోను ఈ విషయాలను వెల్లడించారు. 

ఫిక్కీ చైర్‌పర్సన్ శుభ్రా మహేశ్వరితో జరిగిన ముఖాముఖిలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన పలు ఘటనలను వారితో పంచుకున్నారు. ఓ రోజు రాత్రి ఇంటికెళ్లాక ఓ మహిళ తన ఇంటి ముందు కనిపించిందని, విషయం అడిగితే న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్నానని చెప్పిందని సోను గుర్తు చేసుకున్నారు. ఆమెను ఉదయం కలవమని చెప్పానని, కానీ, పరిచయం లేకున్నా ఆ రాత్రే ఓ వైద్యుడికి ఆమె రిపోర్టులు పంపుతూ మెసేజ్ చేశానన్నారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఆ డాక్టర్ స్పందించి పంపమన్నారని, అలా వెళ్లిన ఆమె ఐదు నెలల చికిత్స అనంతరం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అలాంటి వైద్యులు ఉండడడంతోనే సేవలు చేయగలుగుతున్నట్టు చెప్పారు. 

ఓసారి జోధ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కాలేయ మార్పిడి కోసం తనను సంప్రదించారని, అపోలో ఆసుపత్రిని సంప్రదిస్తే రూ. 40 లక్షల విలువైన చికిత్సను రూ. 18 లక్షలకే చేస్తామన్నారని చెప్పారు. అయితే, రోగి వద్ద రెండు లక్షల రూపాయలే ఉండడంతో రాజస్థాన్ సీఎంతో మాట్లాడితే ఆయన రూ. 10 లక్షలు సాయం చేశారని, మిగతా సొమ్ము తాను  సమకూర్చినట్టు చెప్పారు. అయితే, ఆపరేషన్ తర్వాత సీఎం ఇచ్చిన సొమ్మును చెల్లించకుండా ఆ వ్యక్తి తన ఖాతాలోనే ఉంచుకున్నారని, ఇలాంటి సందర్భాలు కూడా ఎదురయ్యాయని సోనూ సూద్ గుర్తు చేసుకున్నారు. 

మరోసారి నాగ్‌పూర్‌కు చెందిన ఓ యువతికి శ్వాసనాళాలు దెబ్బతింటే విమానంలో హైదరాబాద్ తరలించి చికిత్స అందించానని, అయితే దురదృష్టవశాత్తు ఆమె బతకలేదని, ఆమెకు సహాయకుడిగా వచ్చిన ఆమె సోదరుడు కూడా మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి నాగ్‌పూర్ వెళ్లినప్పుడు ఆ కుటుంబాన్ని తాను కలుస్తానని చెప్పారు.

తాను ఇప్పటి వరకు ఏడున్నర లక్షల మందికి సాయం అందించానని, కానీ వారిలో 95 శాతం మందిని తాను చూడలేదని అన్నారు. తన భార్య తెలుగు మహిళ అని, తన సేవలకు ఆమె కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తోందని సోనూ సూద్ వివరించారు.
Sonu Sood
Bollywood
FICCI Ladies Organisation

More Telugu News