China: జాక్ మా ఇప్పటికే అడ్రస్ లేరు.. ఇప్పుడు చైనా టాప్ బ్యాంకర్ సైతం అదృశ్యం

  • ఆచూకీ లేని ‘ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ చైనా రినైసెన్స్’ చైర్మన్ బావో ఫాన్ 
  • 50 శాతం పతనమైన షేరు ధర
  • ఈ సంస్థలో అవినీతిపై కొనసాగుతున్న దర్యాప్తు
After Jack Ma Chinas top investment banker Bao Fan goes missing

ఒక వ్యక్తి బలవంతుడిగా మారడం కమ్యూనిస్ట్ దేశమైన చైనాకు నచ్చదు. అందుకే చైనా పారిశ్రామికవేత్తలు ఎదిగే కొద్దీ అక్కడి సర్కారు నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా ఇందుకు నిదర్శనం. ఆ మధ్య చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలకు వ్యతిరేకంగా ఆయన విమర్శలు చేయడం ద్వారా తన అస్తిత్వానికే ప్రమాదం తెచ్చుకున్నారు. దీంతో గత మూడేళ్లుగా జాక్ మా కనిపించకుండా పోయారు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియదు. చైనా సర్కారే ఆయన్ను ఎక్కడో ఓ చోట బంధించి, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోందన్నది కొందరి అనుమానం.

తాజాగా చైనా ప్రముఖ బ్యాంకర్, ‘ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ చైనా రీనైసెన్స్’ చైర్మన్, సీఈవో బావో ఫాన్ అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. బావో ఫాన్ ను సంప్రదించలేకపోతున్నట్టు బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ అయిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ చైనా రీనైసెన్స్ ప్రకటించింది. బావో అందుబాటులో లేరన్న దానికి తమ వద్ద సమాచారం లేదని పేర్కొంది. ఈ వార్తలతో శుక్రవారం కంపెనీ షేర్ ధర 50 శాతం పతనాన్ని చూసింది. ఈ సంస్థలో అవినీతికి వ్యతిరేకంగా చైనా సర్కారు దర్యాప్తు చేస్తుండడం, బావో ఫాన్ కనిపించకుండా పోవడంతో, దీని వెనుక సర్కారు హస్తం ఉందా? అన్న అనుమానాలకు తావిస్తోంది.

More Telugu News