Chandrababu: వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది: చంద్రబాబు

  • సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు
  • ప్రతిపక్షాల సభలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శ
  • జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకు వచ్చాయని ప్రశ్న
chandrababu meets injured tdp personnel in anaparthi

ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన వైసీపీ ప్రభుత్వం.. అరాచకాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారని ఆరోపించారు. సభ నిర్వహణకు ముందురోజు అనుమతి ఇచ్చారని, కానీ అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారన్నారు. 

శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్రమంగా నమోదు చేసిన కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని వారికి పిలుపునిచ్చారు. 

కార్యకర్తలను పరామర్శించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. చట్టవ్యతిరేకంగా పని చేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే కొంత మంది పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కావాలనే టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులు సహకరించొద్దని కోరారు. సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు.

More Telugu News