Delhi Liquor Scam: సిసోడియాకు మరోసారి సీబీఐ సమన్లు

  • ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు
  • రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సిసోడియా
CBI summons Manish Sisodia again in Delhi liquor scam

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు పంపించింది. ఈ విషయాన్ని సిసోడియా శనివారం తెలిపారు. ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ పిలిపించిందని ట్వీట్ చేశారు. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా లభించిన తాజా సాక్ష్యాధారాల ఆధారంగా విచారణకు పిలిచారు. దేశ రాజధానికి నూతన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో జరిగిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈ సమన్లు వచ్చాయి. 

‘సీబీఐ నన్ను మళ్లీ పిలిచింది. ఇప్పటికే ఈడీ, సీబీఐల పూర్తి అధికారాన్ని నాపై ప్రయోగించారు. అధికారులు నా ఇంటిపై దాడులు చేశారు. నా బ్యాంకు లాకర్‌లో సోదాలు చేశారు. కానీ నాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేకపోయారు. ఢిల్లీలో పేద పిల్లలను బాగా చదివించేందుకు నేను అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ, వారు నన్ను ఆపాలని కోరుతున్నారు. విచారణకు నేను ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటా. ఇకపైనా ఇలాగే కొనసాగుతాను' అని సిసోడియా ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేయాలనే ఢిల్లీ ప్రభుత్వ విధానం కొంతమంది డీలర్లకు అనుకూలంగా ఉందని, ఇందుకోసం పలువురు నేతలు లంచాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. కానీ, దీనిని ఆప్ తీవ్రంగా ఖండించింది.

More Telugu News