Sharad Pawar: దొంగలను ఒక రోజు ఎంజాయ్ చేయనివ్వండి: ఉద్ధవ్ థాకరే

  • షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం కేటాయించడంపై ఆగ్రహం
  • ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్య హత్య అన్న థాకరే
  • దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి
Let thieves enjoy a day Uddhav Thackeray

ఏక్ నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం (ధనుస్సు, బాణం) కేటాయించడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ థాకరే తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయంపై అగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని దేశంలో ప్రజాస్వామ్య హత్య అని అన్నారు. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఉద్ధవ్ చెప్పారు. 

షిండే వర్గాన్ని దొంగల ముఠా అన్న థాకరే.. ‘దొంగలను ఒకరోజు ఎంజాయ్ చేయనివ్వండి’ అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలను అధైర్యపడవద్దని, పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయిందని ఆరోపించిన ఉద్ధవ్ దాన్ని బీజేపీ బానిస అని అభివర్ణించారు. ఎన్నికల సంఘం చీఫ్‌ను ఎన్నుకునే విధానాన్ని కూడా మార్చాలని డిమాండ్‌ చేశారు.

దేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు చివరి ఆశ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ఈసీ నిర్ణయం నేపథ్యంలో ముంబై, ఇతర ప్రాంతాల్లో పౌర ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయని ఉద్ధవ్ థాకరే తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ‘మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు పనిచేయదని కాషాయ పార్టీకి తెలుసు కాబట్టి వారు తమ స్వలాభం కోసం వారి ముఖానికి బాలాసాహెబ్ ముసుగు వేయవలసి ఉంటుంది. కానీ, చివరికి ముసుగు ఒక ముసుగుగానే మిగులుతుంది’ అని విమర్శించారు. శివసేన మళ్లీ పుంజుకుంటుందని ఉద్ధవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

More Telugu News