Imran Khan: ఆస్ప్రిన్ మాత్రతో కాన్సర్ చికిత్స చేసినట్టుంది... ఐఎంఎఫ్ తో పాక్ ఒప్పందంపై ఇమ్రాన్ ఖాన్ సెటైర్

Imran Khan criticizes Pakistan govt deal with IMF
  • పాక్ లో అంతకంతకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
  • మండిపోతున్న ధరలు
  • ఐఎంఎఫ్ తో పాక్ ప్రభుత్వ ఒప్పందం
  • పన్నులు, ధరలు అమాంతం పెంచేసిన వైనం
  • ఇది తాత్కాలిక ఫలితాన్నే ఇస్తుందన్న ఇమ్రాన్
పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతుండడంతో, ప్రజా జీవనం దయనీయంగా మారింది. పాక్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)తో ఒప్పందం ఆశాదీపంలా కనిపిస్తోంది. దేశంలో పన్నులు భారీగా వడ్డన, ధరల పెంపుదలతో ఐఎంఎఫ్ షరతులను సంతృప్తి పరిచి... ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులను పొందేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

దీనిపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఐఎంఎఫ్ తో పాక్ ఒప్పందం చూస్తుంటే, ఆస్ప్రిన్ మాత్రతో క్యాన్సర్ చికిత్స చేసినట్టుందని విమర్శించారు. ఐఎంఎఫ్ తో ఒప్పందం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇవ్వగలదని స్పష్టం చేశారు. పైగా, ఈ ఒప్పందంతో పాక్ పెను సంక్షోభంలో పడే అవకాశముందని, రుణభారం ఎప్పట్లాగానే పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

తనను రాజకీయంగా వెలివేసేందుకు దేశాన్ని నాశనం చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ పరిస్థితి చూస్తుంటే క్రమంగా ఆర్థిక సమస్యల ఊబిలో కూరుకుపోతోందని, శ్రీలంక తరహా కల్లోలం చెలరేగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Imran Khan
Pakistan
Crisis
IMF
Economy

More Telugu News