Tamilnadu: సైనికుడైన తన తమ్ముడిని చంపిన వారికి శిక్ష పడే వరకు సైన్యంలో తిరిగి చేరనంటున్న జవాను

  • తమిళనాడులో డీఎంకే కౌన్సిలర్ దాడిలో సైనికుడి మృతి
  • నీళ్ల ట్యాంక్ దగ్గర బట్టలు ఉతికే విషయంలో ఘర్షణ
  • సైనికుడి హత్యపై రాష్ట్రంలో రాజకీయ దుమారం
Will not return to Army duty until justice says Brother of soldier killed by DMK councillor

తమిళనాడులోని కృష్ణగిరిలో నీళ్ల ట్యాంక్ దగ్గర బట్టలు ఉతికే విషయంలో జరిగిన గొడవలో భారత సైన్యంలో పనిచేస్తున్న 28 ఏళ్ల ప్రభును డీఎంకే కౌన్సిలర్, అతని సహాయకులు కొట్టి చంపారు. బుధవారం ఈ ఘటన తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్మీ జవాన్‌గా ఉన్న ప్రభు సోదరుడు ప్రభాకర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన తమ్ముడిని చంపిన వారిని శిక్షించేంత వరకూ తాను సైన్యంలో చేరనని చెబుతున్నారు. 

‘నా తమ్ముడిని చంపిన వారిని శిక్షించేంత వరకు నేను ఆర్మీలోకి తిరిగి వెళ్లను. వారికి శిక్ష పడే వరకు డ్యూటీలో చేరను. మేమేమీ తప్పు చేయలేదు. 13 ఏళ్లు సైన్యంలో పనిచేసి నెల రోజుల కిందట ఇక్కడకు వచ్చాను. మా అన్నను చంపిన డీఎంకే కౌన్సిలర్ చిన్నసామి 'నువ్వు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉండొచ్చు కానీ నన్ను ఏమీ చేయలేవు' అంటూ బెదిరిస్తున్నారు‘ అని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. 
 
తన తమ్ముడి హత్య ఎలా జరిగిందనే సంఘటనను ఆయన వివరించారు. ఈ గొడవ ప్రారంభించింది డీఎంకే కౌన్సిలర్ చిన్నసామినే అన్నారు. ‘ఉదయం 10 గంటలకు మేము బట్టలతో నీళ్ల ట్యాంక్ దగ్గరకు వెళ్ళాము. అప్పటికే కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. కానీ కౌన్సిలర్ వారిని ఏమీ అనలేదు. నేరుగా మా వద్దకు వచ్చి అక్కడి నుంచి బట్టలు తీసివేయమని చెప్పాడు. నేను సరే అన్నాను. ఇతరులు కూడా అక్కడ బట్టలు ఉతుకుతున్నప్పుడు, కార్లు కడుగుతున్నప్పుడు లేని సమస్య మనకే ఎందుకుని మా అమ్మను అడిగాను. దాంతో, కౌన్సిలర్ నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. చెప్పు చూపించి కొడతానని బెదిరించాడు. పక్కన ఉన్నవాళ్లు వచ్చి ఆపడంతో మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం. కానీ, ఆ రోజు సాయంత్రం కౌన్సిలర్ చిన్నస్వామి మా ఇంటికి మా నాన్నపై కత్తితో దాడి చేశాడు. ఆయన తలకు గాయమై కిందపడ్డారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన నన్ను ఆరుగురు వ్యక్తులు పట్టుకుని పక్కకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత నా తమ్ముడిపై కత్తులతో దాడి చేసి చంపేశారు‘ అని వివరించారు. 

కాగా, ఈ హత్యలో డీఎంకే కౌన్సిలర్ ప్రమేయం ఉన్నందున పోలీసులు చర్య తీసుకోవడంలో ఆలస్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ, జిల్లా ఎస్పీ సరోజ్‌కుమార్ ఠాకూర్ ఈ ఆరోపణలను ఖండించారు. ప్రభు మృతిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఇది దాడి కేసు అన్నారు. ప్రభు, చిన్నసామి బంధువులని ఠాకూర్ తెలిపారు. ఈ కేసులో నిందితులు ప్రభు రక్త సంబంధీకులని, చిన్నసామి ప్రధాన నిందితుడని చెప్పారు.

More Telugu News