Nara Lokesh: తాను ఏపీకి తీసుకువచ్చిన డిక్సన్ పరిశ్రమ కార్మికులను కలిసిన లోకేశ్

  • సత్యవేడు నియోజకవర్గంలో డిక్సన్ పరిశ్రమ
  • మహిళా కార్మికుల బస్సులో ఎక్కిన లోకేశ్
  • వారిని చూసి హృదయం ఉప్పొంగుతోందంటూ వ్యాఖ్య 
  • డిక్సన్ పరిశ్రమ నాడు తాను తీసుకువచ్చిందేనని లోకేశ్ వెల్లడి
Lokesh with Dixon industry workers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన డిక్సన్ టీవీ పరిశ్రమ కార్మికులను కలుసుకుని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. 

కార్మికులను డిక్సన్ పరిశ్రమకు తీసుకెళుతున్న బస్సులోకి ఎక్కిన లోకేశ్... బస్సులో ఉన్న మహిళా కార్మికులను చూసి మురిసిపోయారు. నాడు డిక్సన్ పరిశ్రమను ఏపీకి తీసుకువచ్చింది తానే అని, ఇవాళ డిక్సన్ పరిశ్రమలో పనిచేసేందుకు వెళుతున్న ఈ సోదరీమణులను చూస్తుంటే హృదయం ఉప్పొంగిపోతోందని లోకేశ్ ట్వీట్ చేశారు. 

డిక్సన్ పరిశ్రమ యాజమాన్యం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టిందని, ఈ పరిశ్రమతో 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. "గత నాలుగేళ్లలో ఇలాంటివి ఎక్కడైనా సీఎం జగన్ తీసుకువచ్చాడా... ఒక్క ఉద్యోగమైనా కల్పించాడా అని చాలెంజ్ చేస్తున్నా" అని లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా లోకేశ్ పంచుకున్నారు. 
అటు, పాదయాత్ర సందర్భంగా రాగిగుంటలో ముదిరాజ్ సామాజిక వర్గ ప్రజలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. వారు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం ఆయన స్పందిస్తూ, పార్టీ పరంగా ముదిరాజ్ లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ముదిరాజ్ కార్పొరేషన్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజ్ లకు ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయిస్తామని, ముదిరాజ్ లకు నియోజకవర్గ స్థాయిలో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. 

సత్యవేడు నియోజకవర్గ యువతతోనూ లోకేశ్ భేటీ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే సిలబస్ లో ప్రక్షాళన తీసుకుస్తామని చెప్పారు. విద్యావ్యవస్థకు సహకారం అందిస్తామని వివరించారు. పాఠశాలల పునరుద్ధరణ ఉంటుందని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడతామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో వేధింపులకు గురవుతున్న ప్రైవేటు పాఠశాలలను కూడా విద్యావ్యవస్థలో వారి వంతు పాత్ర వారు పోషించేలా ప్రోత్సహిస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

More Telugu News