Russian balloons shot down: ఉక్రెయిన్ లోనూ నిఘా బెలూన్లు.. కూల్చివేత!

  • 6 రష్యా బెలూన్లు తమ గగనతలంలో కనిపించాయన్న ఉక్రెయిన్ 
  • ఎయిర్ రైడ్ సైరన్లు మోగించి.. వాటిని కూల్చేశామని వెల్లడి
  • తమ ఎయిర్ డిఫెన్స్ ను గుర్తించి, నాశనం చేసేందుకే వాటిని ప్రయోగించారని ఆరోపణ
ukraine shot down several russian balloons

స్పై బెలూన్ల వ్యవహారం.. అమెరికా- చైనా నుంచి రష్యా-ఉక్రెయిన్ కు పాకింది. తాజాగా ఉక్రెయిన్ లో రష్యాకు చెందిన బెలూన్లు చక్కర్లు కొట్టాయి. దాదాపు 6 బెలూన్లు చాలా సేపు తమ గగనతలంలో తిరిగాయని, వాటన్నింటినీ కూల్చివేశామని ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. వాటిలో కార్నర్ రిఫ్లెక్టర్లు, నిఘా పరికరాలు ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. 

బెలూన్లను వెంటనే కూల్చివేశామని, అలాగే వదిలేస్తే తమ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రమాదముందని ఉక్రెయిన్ మిలిటరీ చెప్పుకొచ్చింది. తమ గగనతలంలో బెలూన్లు కనిపించగానే ఉక్రెయిన్ ఆర్మీ ఎయిర్ రైడ్ సైరన్లు మోగించింది. అలెర్ట్ అయిన సైనికులు వాటిని కూల్చేశారు. తమ ఎయిర్ డిఫెన్స్ ను గుర్తించడం, నాశనం చేయడం కోసమే బెలూన్లను ప్రయోగించారని ఉక్రెయిన్ మిలిటరీ ఆరోపించింది. 

తమ నిఘా డ్రోన్లను కాపాడుకోవడానికి రష్యా ఇలా బెలూన్లను ఉపయోగించుకుని ఉండవచ్చని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి యూరీ ఇహ్నాట్ చెప్పారు. ‘‘ఓర్లాన్ - 10 వంటి నిఘా డ్రోన్లను రష్యా ఎక్కువగా ఉపయోగిస్తోంది. ‘మనం ఈ బెలూన్లను ఎందుకు వాడకూడదు?’ అని భావించినట్లుంది. అందుకే బెలూన్లను ఉపయోగిస్తోంది’’ అని వివరించారు. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ దృష్టి మళ్లించే ఉద్దేశంతో కూడా ఇలా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

ఇటీవల స్పై బెలూన్ల వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. అమెరికా ఎయిర్‌ బేస్‌ పై చైనా స్పై బెలూన్లు చక్కర్లు కొట్టడం, వాటిని అగ్రరాజ్యం కూల్చేయడం తెలిసిందే. భారత్, జపాన్ సహా చాలా దేశాలపై చైనా నిఘా పెట్టిందని అమెరికా చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలో రష్యా బెలూన్లు ఉక్రెయిన్ లో కనిపించడం కలకలం రేపింది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది చనిపోయారు. ఉక్రెయిన్ లోని ఎన్నో గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

More Telugu News