Tamilnadu: తమిళనాడులో డీఎంకే నేత దాడిలో సైనికుడి మృతి

  • నీళ్ల ట్యాంకు దగ్గర కౌన్సిలర్ కు, సోల్జర్ కు మధ్య గొడవ
  • మాటామాటా పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న వైనం
  • అనుచరులను పిలుచుకుని వచ్చి సోల్జర్ పై కర్రలతో దాడిచేసిన డీఎంకే నేత
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలిన సైనికుడు
Soldier Dies Days After Attack By Mob Led By DMK Councillor In Tamil Nadu

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీ నేత దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైనికుడి మృతికి కారణమైన డీఎంకే నేతతో పాటు ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న సైనికుడు ప్రభు ఇటీవల సెలవుపై తమిళనాడులోని సొంతూరుకు వచ్చాడు. 

ఇంటికి దగ్గర్లో ఉన్న నీళ్ల ట్యాంకు వద్ద బట్టలు ఉతికే విషయంలో స్థానిక కౌన్సిలర్, డీఎంకే నేత చిన్నస్వామితో ఈ నెల 8న చిన్న గొడవ జరిగింది. చిన్నస్వామి, ప్రభుల మధ్య మాటామాటా పెరిగి దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈలోపు చిన్నస్వామి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి ప్రభుపైన కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన ప్రభు సోదరుడు ప్రభాకరన్ పైనా దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన ప్రభును స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతూ ప్రభు బుధవారం తుదిశ్వాస వదిలారు. దాడి ఘటనపై ప్రభు సోదరుడు ప్రభాకరన్ ఫిర్యాదుతో ఈ నెల 9న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి ఆసుపత్రిలో ప్రభు చనిపోవడంతో మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు కృష్ణగిరి పోలీసులు వివరించారు.

More Telugu News