Nikki Yadav: యువతిని హత్యచేసి ఫ్రీజర్‌లో దాచిన ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

  • మొబైల్ చార్జింగ్ వైరును ప్రియురాలి మెడకు చుట్టి హత్య
  • ఆ తర్వాత శవాన్ని ఫ్రీజర్‌లో దాచేసిన వైనం
  • ఆ మరుసటి రోజే మరో యువతితో వివాహం
  • నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించిన కోర్టు
Sahil dumped Nikkis body and stood on wedding stage

ఢిల్లీలో యువతిని హత్య చేసి ఫ్రీజర్‌లో దాచిపెట్టిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాహిల్ గహ్లోత్ బాధిత యువతి నిక్కీ యాదవ్‌ మెడకు చార్జింగ్ వైరు బిగించి కారులోనే ఆమెను హత్య చేసినట్టు తేలింది. పోస్టుమార్టం నివేదిక కూడా దీనిని నిర్ధారించింది. అనంతరం శవాన్ని తన పక్కసీటులోనే పెట్టుకుని దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత దక్షిణ ఢిల్లీలోని తన దాబాలోని ప్రీజర్‌లో నిక్కీ శవాన్ని దాచిపెట్టాడు. మంగళవారం శవాన్ని గుర్తించి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోచింగ్ సెంటర్ పరిచయం
హత్య జరిగిన రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధిత యువతి నిక్కీ యాదవ్ అపార్ట్‌మెంట్ పైఅంతస్తులోకి వెళ్లి తిరిగి రాత్రి 9 గంటల సమయంలో బయటకు వస్తున్నట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సాహిల్ తరచూ ఆ ఫ్లాట్‌కు వచ్చిపోతుండేవాడని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు. కోచింగ్ సెంటర్‌కు ఇద్దరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణించే సమయంలో సాహిల్, నిక్కీ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత అది మరింత పెనవేసుకుపోవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

మరో యువతితో నిశ్చితార్థం
ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్న తర్వాత ఈ నెల 9న నిందితుడు సాహిల్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలిసిన నిక్కీ ప్రశ్నించింది. దీంతో ఆమెకు నచ్చజెప్పేందుకు అదే రోజు రాత్రి ఆమె ఫ్లాట్‌కు వచ్చాడు. తెల్లవారుజామున ఇద్దరూ కలిసి కారులో ఢిల్లీ అంతా తిరిగారు. ఈ క్రమంలో నిక్కీ మరోమారు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో కారులోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇలాగైతే లాభం లేదనుకున్న సాహిల్ మొబైల్ చార్జింగ్ కేబుల్‌ను నిక్కీ మెడకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి తన దాబాలోని ఫ్రీజర్‌లో పడేశాడు. ఆ తర్వాత నజఫ్‌గఢ్లోని తన ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాతి రోజున నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 

ఫోన్‌కు స్పందించకపోవడంతో..
మరోవైపు, ఫోన్‌కు కుమార్తె స్పందించకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 14న నిక్కీ శవాన్ని దాబాలోని ఫ్రీజర్‌లో గుర్తించారు. అనంతరం జరిగిన దర్యాప్తులో నిక్కీ, సాహిల్ ప్రేమలో ఉన్నట్టు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

More Telugu News