కూకట్‌పల్లి బస్సుల దగ్ధం వెనక అసలు కారణం ఏమిటంటే..!
- డ్యూటీకి రానన్న డ్రైవర్‌ను గదిలో బంధించి బెల్టుతో చితకబాదిన యజమాని
- ప్రతీకారంగా బస్సుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన డ్రైవర్
- నిందితుడి ఫిర్యాదుతో బస్సు యజమాని, మరో వ్యక్తిపైనా కేసు
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన పసుపులేటి వీరబాబు (34) రెండు నెలలుగా బస్సుల యజమాని కృష్ణారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సిందిగా కృష్ణారెడ్డి ఆదేశించారు. అయితే, తాను ఊరికి వెళ్తున్నానని, డ్యూటీకి రానని వీరబాబు చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి తన సోదరుడి కుమారుడైన యశ్వంత్‌రెడ్డితో కలిసి వీరబాబును ఓ గదిలో బంధించి బెల్టు, కొబ్బరిమట్టతో దాడిచేశాడు.
దీంతో వారిపై పగ పెంచుకున్న వీరబాబు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యారేజీకి వెళ్లి ఓ బస్సుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. ఆ మంటలకు పక్కనే ఉన్న రెండు మినీ బస్సులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరబాబును అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం తెలిసింది. నిందితుడు వీరబాబు ఫిర్యాదుతో బస్సుల యజమాని కృష్ణారెడ్డి, యశ్వంత్‌రెడ్డిపైనా కేసు నమోదైంది.